టార్గెట్ మంగళగిరి... ఈ సక్సెస్ గ్యారంటీనట

లోకేష్ మరోసారి మంగళగిరిలోనే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ వారానికి రెండు రోజులు పర్యటించాలని నిర్ణయించుకున్నారు

Update: 2022-06-10 07:22 GMT

లోకేష్ మరోసారి మంగళగిరిలోనే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఈసారి నియోజకవర్గం మారతారన్న ప్రచారానికి ఆయన ఎప్పడో ఫుల్ స్టాప్ పెట్టారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మెల్సీగా ఉండటంతో పదవిలో ఉన్నట్లయింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ మంగళగిరి పై పూర్తి దృష్టి పెట్టారు. ఈసారి అక్కడి నుంచి ఎలాగైనా గెలవాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. రికార్డులు బ్రేక్ చేయాలని చూస్తున్నారు.

నాలుగు దశాబ్దాలు....
మంగళగిరి లో టీడీపీ గెలచి దాదాపు నాలుగు దశాబ్దాలవుతుంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్లలో 1985లో అక్కడి నుంచి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ మంగళగిరి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. పొత్తులతో ఎన్నికలకు వెళ్లే టీడీపీ మంగళగిరిని మిత్రపక్షాలకు కేటాయించే వారు. అలా చూసినా ఒక్కసారి మాత్రమే అక్కడ మిత్రపక్షం గెలిచింది. 1994లో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు.
గత ఎన్నికల్లో....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మంగళగిరికి ఎక్కడా లేని ప్రాధాన్యత వచ్చింది. రాజధానికి పక్కనే ఉండటంతో గత ఎన్నికలలో లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆళ్ల ఇప్పటికి 2014, 2019లో వరసగా రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఈసారి ఆళ్లపై తీవ్ర వ్యతిరేకత ఉందని లోకేష్ భావిస్తున్నారు. మండలపరిషత్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలను టీడీపీ సాధించింది. దీంతో కొన్ని రోజులుగా మంగళగిరిపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ బీసీ సామాజికవర్గం (పద్మశాలి) ఎక్కువగా ఉండటంతో వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారానికి ఒకసారి....
కొన్ని రోజుల ముందు నారా లోకేష్ మంగళగిరిలో గడప గడపకు పర్యటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా అక్కడ అన్నా క్యాంటిన్ పెట్టాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సహజంగానే ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలుసు. మంచి పేనే చేస్తే ప్రభుత్వం అడ్డుకుంటుందన్న భావన ప్రజల్లో తీసుకెళ్లడానికి చినబాబుకు సులువయింది. అన్నా క్యాంటిన్ ను తిరిగి ప్రారంభించారు. మరింతగా మంగళగిరిలో ప్రజలకు చేరువయ్యేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ మంగళగిరిలో కనీసం వారానికి ఒకసారి పర్యటించాలని ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News