అసద్ వల్ల కానిది వీరి వల్ల అవుతుందా?

ఏపీలో ముస్లిం, హిందువులు దాదాపుగా కలసి ఉంటారు. ముస్లింలు ఉర్దూ కంటే తెలుగులోనే ఏపీలో ఎక్కువగా మాట్లాడతారు

Update: 2022-11-29 07:52 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేరు. అక్కడి ప్రజల ఆలోచన తీరు వేరు. కులాలు గొడవలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మతాల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కొంత తక్కువేనని చెప్పాలి. బీజేపీ మతం పేరిట రాజకీయాలు చేయాలనుకుంటే అది ఏపీలో సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏపీలో ముస్లిం, హిందువులు దాదాపుగా కలసి ఉంటారు. ముస్లింలు ఉర్దూ కంటే తెలుగులోనే ఏపీలో ఎక్కువగా మాట్లాడతారు. తొలి నుంచి ఏపీలో ముస్లింలకు, హిందువులకు మధ్య వివాదాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి.

గ్రామీణ ప్రాంతాల్లో...
కొన్ని నగరాల్లో తప్పించి గ్రామీణ ప్రాంతల్లో హిందూ, ముస్లింలు వర్గాలు సోదరుల్లా కలసి పోయి ఉంటారు. వారి పండగలకు వీరు వెళతారు. వీరి ఇంట కార్యక్రమాలకు వారు వెళతారు. అక్కడ పెద్దగా మత నినాదం వర్క్ అవుట్ కాదు. అందుకే మత ఘర్షణలు కూడా అతి తక్కువగానే జరుగుతుంటాయి. వర్గాలు తప్ప అక్కడ మతాల గొడవ తక్కువేనని చెప్పాలి. ఆలయంలో రధం తగులబడినా, దేవుడి విగ్రహాలు ధ్వంసమైనా అంత త్వరగా సెంటిమెంట్ పనిచేయదు. హిందూ దేవాలయాల్లోకి కూడా ముస్లిం సోదరులు వచ్చి వెళుతుంటారు.

సెంటిమెంట్ రేపేందుకు...
ఇటీవల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప మాల వేసుకుని ముస్లింల టోపీ ధరించారని బీజేపీ యాగీ చేసినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఏపీ పరిస్థితి వేరు. అక్కడి మనుషుల మధ్య బంధాలు వేరు. అందుకని బీజేపీ ఎంత ప్రయత్నించినా సెంటిమెంట్ రేపేందుకు కసరత్తులు చేసినా కుదరదు. అందుకే కపిల తీర్థం టు రామతీర్థం యాత్ర అంటూ బీజేపీ ప్రకటించి ఆ తర్వాత వెనక్కు తగ్గింది. ఆ తర్వాత ఆ యాత్ర ఊసే మరిచి పోయింది. ఎందుకంటే అటువంటి యాత్రలకు ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా స్పందన ఉండదన్నది ఆ ప్రాంత వాసులకు తెలుసు.

ఒవైసీ వల్ల కూడా...
అసదుద్దీన్ ఒవైసీ ఎన్నో రాష్ట్రాల్లో తన పార్టీ జెండాను ఎగురవేయగలిగాడు. కానీ ఏపీలో మాత్రం ఎంఐఎం కాలు మోపలేకపోయింది. ఎందుకూ అంటే అక్కడ అసద్ వెంట నడిచే ముస్లిం సామాజికవర్గం కంటే ఇతర పార్టీల వెంట నడిచే వారు ఎక్కువగా ఉంటారు. ఉదయం లేస్తే గ్రామాల్లో కలసి మెలసి ఉండే హిందూ ముస్లింలను విభజించడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు సయితం చెబుతున్నారు. అందుకే బీజేపీ సెంటిమెంట్ పరంగా ఎన్ని ఫీట్లు చేసినా ఏపీలో ఫలితం పెద్దగా కన్పించదన్నది వాస్తవం. మరో రూట్లో వెళితేనే బీజేపీ బలోపేతం అవుతుంది తప్పించి మత పరమైన అంశాలను రెచ్చగొట్టి ఏపీలో ఓట్లు దండుకోవడం సాధ్యం కాకపోవచ్చు.


Tags:    

Similar News