జగన్ కు ఫైర్ బ్రిగేడ్ గా ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జగన్ కు ఫైర్ బ్రిగేడ్ గా మారారు.

Update: 2021-11-23 08:35 GMT

ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జగన్ కు ఫైర్ బ్రిగేడ్ గా మారారు. చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ ఎలా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా జగన్ కు అలా మారారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఆయన స్పందించడాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా జగన్ అనుకూలంగా లేఖలు రాస్తున్నారని నెట్టింట నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పార్టీలకతీతంగా....
చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో దూషించినందుకు ఆయన ఏకంగా శాసనసభను బహిష్కరించారు. సిఎం అయిన తర్వాతనే సభకు వస్తానని శపథం చేసి వెళ్లిపోయారు. పార్టీలకతీతంగా చంద్రబాబు కు అందరూ సంఘీభావం తెలిపారు. కానీ అసెంబ్లీ జరిగిన ఘటన సంగతి పక్కన పెడితే చంద్రబాబు సానుభూతి కోసం కన్నీళ్లు కార్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం లేఖ చంద్రబాబును ఇబ్బంది పెట్టే విధంగానే ఉంది.
కాపు సామాజికవర్గంలో....
ప్రధానంగా తనకు అనుకూలంగా మారతారనుకున్న కాపు సామాజికవర్గంలో ముద్రగడ పాత చిచ్చు రేపారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబును సమర్థించారు. ఆయన ఇటీవలే కాపు పెద్దలంతా ఏకమై కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గాలన్నీ ఏకం చేయాలని పిలుపు నిచ్చారు. కానీ చంద్రబాబు విషయంలో ముద్రగడ పద్మనాభం వదలి పెట్టేట్లు లేరు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నారు.
జగన్ కు అనుకూలమేనా?
ఆయన ఇప్పుడు కాపు ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా తనకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవమానాన్ని మర్చిపోలేక పోతున్నారు. తనను తన కుటుంబాన్ని పోలీసులు హింసించిన తీరును ముద్రగడ చంద్రబాబుకు గుర్తు చేశారు. కన్నీళ్లతో సానుభూతి పొందాలనుకుంటున్న చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలో మాత్రం అడ్డుకట్ట వేశారు. ఎవరు కాదనుకున్నా ఇప్పటికీ.. ఎప్పటికీ కాపు సామాజికవర్గంలో ముద్రగడకు ఒక గుర్తింపు ఉంది. ఒక గౌరవం ఉంది. అందుకే ఆయన చెప్పే మాటలకు, చేతలకు ఒక విలువ ఉంటుంది. దీంతో చంద్రబాబుకు రాసిన లేఖతో జగన్ కు ముద్రగడ అండగా నిలిచారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జగన్ కు ముద్రగడ ఫైర్ బ్రిగేడ్ గా మారారంటున్నారు.



Tags:    

Similar News