మోత్కుపల్లితో విజయసాయి మాట్లాడిందిదేనా?

Update: 2018-06-14 12:56 GMT

శత్రువుకి శత్రువే మిత్రుడు అనే ఫార్ములా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అమలు చేస్తుంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వారందరినీ కలుపుకుని పోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గురువారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణకు చెందిన ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న మోత్కుపల్లి చంద్రబాబు ఓటమి కోసం తిరుమలకు కాలి నడకన వచ్చి మొక్కుకుంటానని స్పష్టం చేశారు. ఏపీ మొత్తం తిరిగి చంద్రబాబు చేసే మోసలను వివరిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి రెండు రోజులుగా వీరి భేటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే, ఇవాళ ఈ ప్రచారాన్ని నిజం చేశారు. మోత్కుపల్లిని తెలంగాణకు చెందిన వ్యక్తిగా కాకుండా, ఒక దళిత నాయకుడిగా వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి ద్వారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ఎండగట్టాలనేది వారి ఆలోచనగా కనపడుతోంది. భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...మోత్కుపల్లి వచ్చే నెల చేపట్టనున్న తిరుమల యాత్రకు తాము సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Similar News