టీడీపీకి ఆ ఆలోచన లేదా? అదే కారణమా?

మునుగోడు ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది. అయినా అక్కడ పోటీ చేసేందుకు టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు.

Update: 2022-10-01 07:09 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సెప్టంబరు   నెలలోనే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టాలని భావించారు. జులై నెలలో ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అయితే సెప్టంబరులో సభ పెట్టలేదు. ఈ నెలలో పెట్టాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగే సభ ద్వారా పార్టీ సత్తాను రాజకీయ పార్టీలకు చాటి చెప్పాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. కానీ అందుకు ఆయన ఇంకా తేదీలను తెలంగాణ నేతలకు ఇవ్వలేదు. తెలంగాణలో పార్టీ బలంగా లేదని చంద్రబాబుకు తెలియంది కాదు. అయితే హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ఉంది. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కనీస ఓట్లను సాధిండమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పార్టీకి ఇప్పటికీ ఓటు బ్యాంకు చెదరలేదన్న విశ్వాసంతో ఉన్నారు.

గత రెండు ఉప ఎన్నికల్లో...
మునుగోడు ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది. అయినా అక్కడ పోట ీ చేసేందుకు టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. పార్టీ కూడా అక్కడ పోటీ చేయించే ఉద్దేశ్యం లేదు. పోటీ చేసి చేతి చమురు వదుల్చుకోవడం మినహా మరేది లేదన్నది అందరి నమ్మకం. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగింది. హుజూర్‌నగర్ లో చావా కిరణ్మయి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మొవ్వ అరుణ్ కుమార్ పోటీ చేశారు. హుజూర్ నగర్ లో టీడీపీకి ఐదు వేల ఓట్లు వరకూ వచ్చాయి. నాగార్జున సాగర్ లో మాత్రం రెండు వేల ఓట్లకు మించలేదు. రెండు ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది.
ఎలాంటి కసరత్తు...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కొంత బలంగా ఉన్నట్లు పార్టీ నేతలు ఇప్పటికీ అంచనా వేస్తున్నారు. ఏపీ సరిహద్దు జిల్లా కావడంతో పార్టీ ఓటు బ్యాంకు ఇంకా ఉందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే గత రెండు ఉప ఎన్నికల్లో పార్టీ పోటీకి దిగింది. అయితే ఈసారి మునుగోడు ఉప ఎన్నికలపై టీడీపీ ఎలాంటి కసరత్తు ఇప్పటి వరకూ చేయడం లేదు. పోటీ చేయడానికి ముందుకు కూడా ఎవరూ రావడం లేదు. తొలి నుంచి కమ్యునిస్టులు, కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం కావడంతో టీడీపీ పోటీ చేయకపోవడమే బెటరన్న ఆలోచనలో ఉంది.
ఎవరూ మద్దతు కోసం...
అయినా మునుగోడు ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు కోసం ఎవరూ ప్రయత్నించడం లేదు. బీజేపీ ఈ ఎన్నికలో మద్దతు కోరుతుందని చంద్రబాబు అంచనా వేశారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం ఎక్కువని ఆయన అధినాయకత్వానికి చెప్పినట్లు సమాచారం. కమ్యునిస్టుల మద్దతును టీఆర్ఎస్ తీసుకుంది. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ తన పార్టీలో విలీనం చేసుకుంది. కానీ టీడీపీ మద్దతు కావాలని ఎవరూ ప్రయత్నించకపోవడంతో చంద్రబాబు ఖమ్మం సభ ద్వారా సత్తా చాటాలనుకుంటున్నారు. ఆ తర్వాతనైనా తెలంగాణలో బీజేపీ ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 


Tags:    

Similar News