మోదీ మార్కు 'మార్కెటింగ్‌'

చంద్రయాన్‌`3 చంద్రుడి మీద ల్యాండ్‌ అవగానే టీవీపై మనకు కనిపించిందేమిటి? కుడివైపు చంద్రుడి మీద దిగిన శాటిటైట్‌ (ఓ చిన్న ఫోటో). ఎడమ వైపు చప్పట్లు కొడుతున్న మోదీ (పెద్ద ఫోటో). ఆ దృశ్యం చూసిన సామాన్యుడు ఏమనుకుంటాడు? ‘అటు వైపున్న మోదీ వల్లే ఇటువైపు చంద్రయాన్‌ సాధ్యమైంది’. ఇదీ మోదీ మార్కు మార్కెటింగ్‌ మాయాజాలం. ఓ పనిని సాధించే ప్రక్రియలో తన పాత్ర ఎంత ఉన్నా విజయంలో మాత్రం తనే కనపడాలి అనేది మోదీ మంత్రం. ఓ చాయ్‌వాలాను 140 కోట్ల భారతదేశానికి పూర్తి మెజారిటీ ప్రధానమంత్రిని చేసిన మ్యాజిక్‌ అది.

Update: 2023-08-28 07:47 GMT

చంద్రయాన్‌`3 చంద్రుడి మీద ల్యాండ్‌ అవగానే టీవీపై మనకు కనిపించిందేమిటి? కుడివైపు చంద్రుడి మీద దిగిన శాటిటైట్‌ (ఓ చిన్న ఫోటో). ఎడమ వైపు చప్పట్లు కొడుతున్న మోదీ (పెద్ద ఫోటో). ఆ దృశ్యం చూసిన సామాన్యుడు ఏమనుకుంటాడు? ‘అటు వైపున్న మోదీ వల్లే ఇటువైపు చంద్రయాన్‌ సాధ్యమైంది’. ఇదీ మోదీ మార్కు మార్కెటింగ్‌ మాయాజాలం. ఓ పనిని సాధించే ప్రక్రియలో తన పాత్ర ఎంత ఉన్నా విజయంలో మాత్రం తనే కనపడాలి అనేది మోదీ మంత్రం. ఓ చాయ్‌వాలాను 140 కోట్ల భారతదేశానికి పూర్తి మెజారిటీ ప్రధానమంత్రిని చేసిన మ్యాజిక్‌ అది.

దామోదర నరేంద్ర మోదీని గుజరాత్‌ ముఖ్యమంత్రిని చేసిన మంత్రదండం కూడా అదే. గుజరాత్‌ మోడల్‌ అంటూ 2014లో ఊదరగొట్టిన మార్కెటింగ్‌ టెక్నిక్‌ కూడా అదే. అతిరధ, మహారధులైన ఎల్‌.కె.అడ్వానీ, మురళీ మనోహర్‌ జోషీలను వయో వృద్ధుల కోటాలో ‘మూల’న పడేసిన మహాశక్తి కూడా అదే. మనకు కనిపించే నరేంద్ర మోదీ వెనుక కనిపించని ఓ నెట్‌వర్క్‌ పని చేస్తూ ఉంటుంది. అది మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌. తనకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న ప్రతీ వ్యక్తి, ప్రతీ సందర్భం, ప్రతీ ప్రాంతం గురించి మోదీకి తెలుసు. తన అవసరాలకు అనుగుణంగా ప్రతీ అవకాశాన్ని ఎలా మలచుకోవాలో ఆయనకు తెలుసు. చంద్రయాన్‌`2 విఫలమైనప్పుడు నాటి ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ను ఏడిపించడం తెలుసు, అతన్ని ఓదార్చడం తెలుసు. నేటి ఛైర్మన్‌ సోమనాధ్‌ను అభినందించడం తెలుసు. కానీ ఈ అన్ని సందర్భాల్లోనూ హైలైట్‌ అవుతున్నది, లబ్ధి పొందుతున్నది నరేంద్ర మోదీనే.

చంద్రయాన్‌`3 చంద్రుని మీద దిగే సమయానికి మోదీ సౌతాఫ్రికాలోని జొహెన్నస్‌బర్గ్‌లో ఉన్నారు. కానీ శాటిలైట్‌ ల్యాండ్‌ అయ్యే సమయానికి టీవీలో ప్రత్యక్షమయ్యారు. కోట్లాది మందికీ నరేంద్రమోదీనే ఎక్కువసేపు కనిపించారు. శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఓ పది నిముషాలు మాట్లాడారు. అక్కడే ఆయనే హైలైట్‌ అయ్యారు. దక్షిణాఫ్రికా నుంచి వస్తూ తిన్నగా బెంగళూరులో దిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించి, వాళ్లతో ఫోటోలు దిగి మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించారు. చంద్రయాన్‌`3 ల్యాండ్‌ అయిన ప్రాంతానికి శివ శక్తి అని నామకరణం ఆ క్రెడిట్‌నూ తన ఖాతాలో వేసుకున్నారు, ఇక్కడ కూడా ప్రధానమంత్రే వార్తల్లో నిలిచారు.. రాత్రీ పగలు కృషి చేసి, చంద్రయానాన్ని సుసాధ్యం చేసిన శాస్త్రవేత్తలంతా మోదీ ముందు దిగదుడుపు అయ్యారు. దటీజ్‌ నరేంద్ర మోదీ.

పెద్ద నోట్ల రద్దు ప్రయోగం దారుణంగా విఫలమయ్యాక, జీఎస్టీతో జనం కష్టాలు పడుతున్న వేళ కూడా... 2014 కంటే ఎక్కువ మెజార్టీతో మోదీ ప్రధానమంత్రి అయ్యారంటే అది మామూలు విషయం కాదు. వైఫల్యాలను దాచిపెట్టి, చిన్న చిన్న విజయాలను కూడా తన ఖాతాలో వేసుకోగలిగే బ్రహ్మాస్త్రం మోదీ అండ్‌ టీమ్‌కు బాగా తెలుసు. 2024లో కూడా మోదీనే గెలుస్తారని సర్వేలు చెప్పడానికి కూడా అదే కారణం. ఇండియా కూటమి అని కప్పల తక్కెడ ఒకటి ఉన్నా, ఏ కప్ప ఎటువైపు గెంతుతుందో తెలియని పరిస్థితి... అక్కడి పార్టీలది. బిహార్‌లో సెపరేట్‌గా పోటీ చేస్తామని ఆప్‌ ప్రకటించింది. అక్కడ జనతాదళ్‌, ఆర్జేడీలు కూడా ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములు. అంటే ఆల్రెడీ బిహార్‌లో రచ్చ మొదలైందన్నమాట. ప్రతీ రాష్ట్రంలో ఇలా గొడవలు మొదలవుతాయి. అందుకే మోదీని ఓడించాలంటే, తనను తాను బాగా మార్కెట్‌ చేసుకోగలిగే మరో నాయకుడు రావాలి. లేదా వాస్తవానికి, పబ్లిసిటీకి మధ్య తేడా అయినా జనానికి తెలిసి ఉండాలి. ఆ రెండూ ఇంత వేగం సాధ్యం కాదు. అందుకే మోదీకి కూడా ఇప్పట్లో తిరుగులేదు.

Tags:    

Similar News