జగన్, పవన్ ల సంబరాలు చూస్తుంటే....?

Update: 2018-12-12 13:31 GMT

కేసీఆర్ సంక్షేమ పథకాల వల్లే విజయం సాధించారని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల తీర్పును పార్టీలు గౌరవించాలన్నారు.తెలంగాణ తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. విభజన తరువాత తెలంగాణలో కంటే ఎక్కువ అభివృద్ధి సాధించామన్న ఆదినారాయణరెడ్డి ఏపీలోని 175 నియోజక వర్గాలలో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామని చెప్పారు. ఏపీలో లక్షన్నర రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ జరిగిందన్నారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉన్నారని, ఏపీ లో అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

జగన్, పవన్ లు రాజకీయాలు మానుకోవాలి...

రాష్ట్రం ముక్కలు కావడానికి కారణమయిన కేసీఆర్ అక్కడ గెలిస్తే ఇక్కడ జగన్ , పవన్ లు సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. ధర్మ పోరాటం చేస్తోన్న చంద్రబాబుని విమర్శించడమేంటని ఎద్దేవా చేశారు.. సోనియా హోదా ఇస్తామని చెప్పారన్నారు. కేసు ల మాఫీ కోసమే బీజేపీతో జత కడుతున్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న జగన్ కనీసం పోటీ చేయలేదని దెప్పి పొడిచారు. పవన్ అటు వైపు చూడలేదని సెటైర్ వేశారు. జగన్, పవన్ లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు వారిని తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ జాబితా ముందే ప్రకటించారని, కూటమి ఓటమికి అదొక కారణమని ఆదినారాయణరెడ్డి విశ్లేషించారు. రానున్న ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏపీకి వస్తే స్వాగతం పలుకుతామన్నారు.

Similar News