పెంచిన వాళ్ళే ముంచుతున్నారా?

యోగ కారకుడే మారకుడు అవుతాడని జ్యోతిష శాస్త్రంలో ఓ మాట ఉంది. బతికున్నన్నాళ్లూ ఉచ్ఛ దశను ఇచ్చే గ్రహమే నాశనకారి అవుతుందట. ఈ మాట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా వర్తిస్తుంది. ఆయన అభివృద్ధికి కారణమైన అనుకూల మీడియానే ఈ రోజు ఆయనకు దశ, దిశ లేకుండా చేస్తోంది. ఐటీ పితామహుడిగా, అభివృద్ధికి నిర్వచనంగా అర్బన్‌ ప్రజల్లో ఇప్పటికీ చంద్రబాబుకు గుర్తింపు ఉంది.

Update: 2023-09-23 06:14 GMT

సొంత నెట్వర్క్ లేని చంద్రబాబు

రంగు, రుచి, వాసన అనుకూల మీడియానే..!

యోగ కారకుడే మారకుడు అవుతాడని జ్యోతిష శాస్త్రంలో ఓ మాట ఉంది. బతికున్నన్నాళ్లూ ఉచ్ఛ దశను ఇచ్చే గ్రహమే నాశనకారి అవుతుందట. ఈ మాట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా వర్తిస్తుంది. ఆయన పాపులారిటీకి కారణమైన అనుకూల మీడియానే ఈ రోజు ఆయనకు దశ, దిశ లేకుండా చేస్తోంది. ఐటీ పితామహుడిగా, అభివృద్ధికి నిర్వచనంగా అర్బన్‌ ప్రజల్లో ఇప్పటికీ చంద్రబాబుకు గుర్తింపు ఉంది. కానీ అధిక శాతం ప్రజల అభిమానాన్ని పొందే దిశగా ఆయన స్వీయ ప్రయత్నాలు చేయడం లేదు. దీనివల్ల మెజార్టీ జనాలతో ఆయన డిస్‌కనెక్ట్‌ అయిపోయారు. తన భజన చేసే మీడియాను జ్ఞానేంద్రియాలుగా మలుచుకున్న తెలుగుదేశం అధినేత... సామాన్యుడికి తనకూ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడుతోందని గ్రహించలేకపోతున్నారు. అందుకే ప్రతీ ఎన్నికల్లో పొత్తుల కోసం వెంపర్లాడాల్సి వస్తోంది.

కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేసి, తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓటమి పాలై, ఎన్టీయార్‌ పంచన చేరి, మామ చాటు అల్లుడిగా వ్యవహారాలు నడిపి, ‘బిగ్‌ డెసిషన్‌’ తీసుకుని, తొమ్మిదేళ్లు అవిభాజ్య రాష్ట్రానికి... ఐదేళ్లు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడిది. జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పిన ఘనత బాబుగారిది. ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ రంగాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా చరిత్రలో ఆయన పేరు నిలుస్తుంది. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేనాటికి ఆయన రాజకీయ పరిభాషలో యువనేతే. నాటి బాబు స్పీడు... యువతను ఆకర్షించింది. ఆయన కార్పొరేట్‌ జార్గాన్‌.. బిజినెస్‌ మెన్‌ ఏపీ వైపు చూసేలా చేసింది. రాష్ట్రాన్ని కార్పొరేట్‌ కంపెనీలా మార్చి, తాను ఆంధ్రప్రదేశ్‌ సీఈఓ అని ఆయన చెప్పుకునేవారు.

బాబు ఉత్థానం వెనుక ఆయన కృషితో పాటు ఆయన అనుకూల మీడియా కష్టం కూడా ఉంది. యువ ముఖ్యమంత్రిగా, స్వర్ణాంధ్రప్రదేశ్‌ రధ సారధిగా ఆయనను ఓ వర్గం మీడియా ఆకాశానికి ఎత్తేసేది. 1990ల్లో ‘ఈనాడు’.. తెలుగు పత్రికల్లో దాదాపు ఎనభై శాతం సర్క్యులేషన్‌ను ఎంజాయ్‌ చేసేది. దానికి అందనంత దూరంలో మిగిలిన పత్రికలు ఉండేవి. ఎన్టీయార్‌ పదవీచ్యుతి నుంచి ‘ఈనాడు’ చంద్రబాబుని నిర్ద్వంద్వంగా సపోర్ట్‌ చేసింది. అతని మీద ప్రతి రోజూ పాజిటివ్‌ కథనాలు వచ్చేవి. రాష్ట్రంలో ఏదైనా తప్పు జరిగితే... అధికారులను, వ్యవస్థలను బాధ్యులని చేసే ‘ఈనాడు’... మంచిని చంద్రబాబు ఖాతాలో వేసేది. జనం కూడా అదే నిజమని నమ్మేవారు. తన అనుకూల పత్రికలను మాత్రమే ఫాలో అయ్యే బాబు, క్షేత్రస్థాయి వాస్తవానికి క్రమంగా దూరమైపోయారు.

1999 ఎన్నికల నాటికే పల్లెటూళ్లలో బాబు పాలనపై అసంతృప్తి మొదలైంది. చంద్రబాబు వ్యవసాయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. సేవల రంగమే సరైందని, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన నమ్మారు. దీంతో తిండి పెట్టే వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. అయితే కార్గిల్‌ యుద్ధానంతరం జరిగిన ఎన్నికల్లో భాజపా మద్దతుతో 1999 ఎన్నికల్లో ఆయన గట్టెక్కారు. మీడియా మద్దతు కూడా ఆయనకు ఇతోధికంగా సాయపడింది. తన అనుకూల మీడియా ఉన్నంత వరకూ తన పదవికి ఢోకా లేదని ఆయన భావించారు. 2000 సంవత్సరం తర్వాత సామాన్య జనంతో ఆయనకు ఉన్న ‘బంధం’ దాదాపుగా కట్‌ అయిపోయింది.

2003 లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి జనానికి చేరువ అయ్యారు. ఆ పాదయాత్ర ఫలితమే వ్యవసాయానికి ఉచిత కరెంట్‌, ఆరోగ్య శ్రీ లాంటి అద్భుతమైన పథకాలు. ఈ గ్రౌండ్‌ లెవెల్ వాస్తవాలను చంద్రబాబు విస్మరించారు. తాను అధికారం కోల్పోవడం ప్రజల దురదృష్టమని భావించారు. ఆయన అనుకూల మీడియా కూడా.. తన రాతల్లో అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. వాటినే చదివి, తనను ఓడించిన జనం అజ్ఞానంపై చంద్రబాబు చాలా జాలి పడేవారు. రాజశేఖరరెడ్డి హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వాటిని క్యాష్‌ చేసుకోడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతిచ్చే మీడియా ప్రయత్నించాయి. 2009లో తెలుగుదేశం నాటి తెరాస, వామపక్షాలతో ఓ కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. చంద్రబాబు ‘రాజశేఖరరెడ్డి అవినీతి’నే ఆయుధంగా ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్‌కి గట్టి పోటీ ఇచ్చారు. కానీ చంద్రబాబు తనకంటూ ఓ పాజిటివ్ ఓటును తెచ్చుకోలేకపోయారు.

రాజశేఖరరెడ్డి ప్రజాదరణ ముందు తెలుగుదేశం కూటమి తేలిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో కూడా మోదీ, పవన్‌ కల్యాణ్‌ మద్దతుతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ తర్వాత కూడా ఆయన జనానికి దూరంగానే ఉన్నారు. వాస్తవదూరమైన ‘అమరావతి మహా నగర నిర్మాణం’ అంటూ పగటి కలల్లో తేలారు. ప్రజల అవసరాలను విస్మరించారు. తనపై పత్రికల్లో వచ్చే తన అనుకూల వార్తల్ని చూసి సంబరపడ్డారు. 2019 ఎన్నికల్లో ‘నూటికి వేయి శాతం’ తనదే విజయమని ఘంటాపధంగా చెప్పేవారు. కానీ ఎనభై ఆరు శాతం సీట్లతో, 51 శాతం ఓట్లతో జగన్‌ సంచలన విజయం సాధిస్తారని చంద్రబాబు, ఆయన మీడియా అంచనా వేయలేకపోయింది. 2018లో ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు బయటకు రావడానికి కూడా ఆయన అనుకూల మీడియా చేసిన హడావుడే ప్రధాన కారణం. ఇలా మీడియాని నమ్ముకున్న బాబు... తన సొంత వ్యూహాన్ని రూపొందించలేకపోయారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి పరోక్షంగా ఆయన అనుకూల మీడియా కారణం. ఆయనకు సొంత నెట్‌వర్క్‌ లేకపోవడం ప్రత్యక్ష కారణం.

కానీ జగన్‌ పద్ధతి వేరు. ఆయనకు సొంతంగా ‘సాక్షి’ ఉన్నా, జనాలకు చేరువ అయ్యే విషయంలో తనకంటూ కొన్ని సొంత పద్ధతులు ఉన్నాయి., ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటారు. తనకో టీమ్‌ ఉంది. నెట్‌వర్క్‌ ఉంది. గ్రౌండ్‌ లెవెల్‌ రియాలిటీ ఎప్పటికప్పుడు ఆయనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే తనకు మీడియా సపోర్ట్‌ లేదని జగన్‌ జనంతో చెబుతూ ఉంటారు. జనాల చేతిలోకి మొబైల్‌ ఫోన్లు వచ్చిన తర్వాత... మీడియా వాళ్లను గతంలోలా ప్రభావితం చేయలేకపోతోంది. అనుకూల, వ్యతిరేక కథనాలు కొంతమందిపై ప్రభావం చూపించవచ్చు కానీ, ఎన్నికల్లో విజయావకాశాలను నిర్ణయించవు. నాయకుల మాటలు, చేతలే విజయానికి కొలమానం. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించకపోతే... ఆ పార్టీకే కాదు, రాష్ట్రానికి కూడా కోలుకోలేని నష్టం జరుగుతుంది.

Tags:    

Similar News