టీడీపీలో అంతా హ్యాపీ.. రీజన్ ఇదేనట

టీడీపీ కడప జిల్లాలో చాలా మంది హ్యాపీగా ఉన్నారట. దీనికి కారణం గత ఎన్నికలకు ముందు పరిస్థితులు పార్టీలో లేకపోవడమే.

Update: 2022-12-06 07:25 GMT

తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో చాలా మంది హ్యాపీగా ఉన్నారట. దీనికి కారణం గత ఎన్నికలకు ముందు పరిస్థితులు పార్టీలో లేకపోవడమేనని అంటున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్లు రాక అనేక మంది నిరుత్సాహానికి గురయ్యారు. ఐదేళ్లు పడిన శ్రమ అంతా వృధా అయిందని సీనియర్ నేతలు కూడా బాధపడి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నారు. తమకు టిక్కెట్లు రాకపోవడానికి ప్రధానమైన నేత ఇప్పుడు లేకపోవడంతో ఈసారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్న భావనలో కడప జిల్లాలో టీడీపీ నేతలు ఉన్నారు.


అంతా ఆయనదే...

2019 ఎన్నికలకు ముందు కడప జిల్లాకు ఎవరు పార్టీ అధ్యక్షుడిగా ఉండనీ, ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉండనీ.. కథ నడిపింది మొత్తం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాత్రమే. ఆయన సూచించిన వారికే ఎక్కువ మందికి జిల్లాలోని నియోజకవర్గాల్లో టిక్కెట్ ను అధిష్టానం కేటాయించిందన్నది అందరూ అంగీకరిస్తున్నారు. సీఎం రమేష్ ఆర్థికంగా పార్టీని ఆదుకున్నందున ఆయన మాటకు హైకమాండ్ కూడా విలువిచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా జిల్లాలో పట్టు పెంచుకునేందుకు సీఎం రమేష్ తన వారికి టిక్కెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారంటున్నారు. చంద్రబాబు కూడా సీఎం రమేష్ అంటే కొంత సానుకూలత ఉండటంతో ఆయన చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారంటారు.

ఎంపీగా కూడా...
అందులో భాగంగానే జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించాలని ప్రతిపదించింది కూడా సీఎం రమేష్ మాత్రమేనట. మళ్లీ అధికారంలోకి వస్తే ఆదినారాయణరెడ్డి మంత్రి పదవి కోరతారని, తన అనుచరుడికి మంత్రి పదవి ఇప్పించుకోవడానికి ఆయన ఈ ప్రతిపాదనను తెచ్చినట్లు చెబుతున్నారు. ఎంపీ ఎన్నికకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని ఆయన చెప్పడంతో జమ్మలమడుగు టిక్కెట్ ను ఆయనను కాదని రామసుబ్బారెడ్డికి ఇచ్చారంటారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోగా, ఆదినారాయణ రెడ్డి బీజేపీ పంచన చేరారు.

ప్రొద్దుటూరులోనూ....
ఇక ప్రొద్దుటూరు టిక్కెట్ విషయానికొస్తే అక్కడ నంద్యాల వరదరాజులు రెడ్డి టిక్కెట్ కోసం చాలా ప్రయత్నించారు. కానీ ఆయనకు దక్కకుండా మల్లెల లింగారెడ్డికి టిక్కెట్ దక్కడంలో అప్పుడు సీఎం రమేష్ ప్రధాన పాత్ర పోషించారంటారు. అందుకే అప్పట్లో వరదరాజులురెడ్డి సీఎం రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా బహిరంగంగానే చేశారు. అయితే ఈసారి ఎన్నికల నాటికి సీఎం రమేష్ పార్టీలో లేకపోవడంతో జిల్లా నేతలు కొంత ఊపిరిపీల్చుకున్నారని తెలిసింది. సర్వే ప్రకారమే టిక్కెట్ లు అధిష్టానం ఇస్తే మంచిదేనని, కేవలం డబ్బులు పెడతారని, అంతమాత్రాన బలహీనమైన వ్యక్తులను సిఫార్సు చేసి గత ఎన్నికల్లో పది పదికి స్థానాలను వైసీపీకి అప్పగించేలా చేశారన్న కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆయన బాధ లేకపోవడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారట. గెలుపు గుర్రాలకే ఈసారి టిక్కెట్లు వస్తాయని, పార్టీకి జిల్లాలో పట్టు లభిస్తుందని భావిస్తున్నారట.


Tags:    

Similar News