ఖర్గే సొంత ఇమేజ్ తో వెళతారా?

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఈరోజు బాధ్యతలను చేపట్టబోతున్నారు. అయితే ఆయనకు ఈ పదవి అంత సులువుకాదు

Update: 2022-10-26 03:28 GMT

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఈరోజు బాధ్యతలను చేపట్టబోతున్నారు. అయితే ఆయనకు ఈ పదవి అంత సులువుకాదు. ముందు ముందు ఎన్నో సవాళ్లను ఆయన ఎదుర్కొనాల్సి ఉంది. ప్రధానంంగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు అనంతరం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో పనితీరును కనపర్చాల్సి ఉంటుంది. అయితే అంత సులువు కాదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొంత మేర ప్రభావం చూపించవచ్చు. గుజరాత్ ఎన్నికల సమయానికి పాదయాత్ర ఉత్తర భారతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.

పీసీసీ అధ్యక్షులను...
అయితే రాహుల్ గాంధీ కాకుండా తనకంటూ సొంత మార్క్ ను మల్లికార్జున ఖర్గే చూపించుకోవాల్సి ఉంటుంది. తొలుత అన్ని రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలకు సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొందరిని నియమించారు. వారిని మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో పీసీీసీ అధ్యక్షులను కొత్తగా నియామకం చేపట్టాల్సి ఉంది. ఎన్నో ఒత్తిళ్లు ఎదురవుతాయి. సిఫార్సులు టేబుల్ ముందుకు వస్తాయి. వాటిని తట్టుకుని పార్టీని బలోపేతం చేసే వారిని మాత్రమే రాష్ట్ర అధ్కక్షుడిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.
సొంత రాష్ట్రం....
మల్లికార్జున ఖర్గే కిందిస్థాయి నుంచి వచ్చిన నేత. ఇక ఆయనకు మరో విషమ పరీక్ష. సొంత రాష్ట్రం. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పార్టీ హైకమాండ్ ఖర్గేను ఎంపిక చేసిందంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ బలంగానే ఉంది. ఇప్పుడు యడ్యూరప్ప కూడా అడ్డంకిగా లేరు. ఈ సమయంలో కాంగ్రెస్ ను ఒంటరిగా అధికారంలోకి వచ్చే విధంగా మల్లికార్జున ఖర్గే పనితీరును కనబర్చాల్సి ఉంటుంది. కర్ణాటక ఎన్నికలు ఖర్గే కు కీలకమనే చెప్పాలి. ఏ మాత్రం తేడా కొట్టినా ఆయనకు రాజకీయంగా ఇబ్బందిగా మారనుంది.
రాహుల్ ప్రమేయం...
అయితే గాంధీ కుటుంబం నుంచి ఖచ్చితంగా వత్తిడి ఉంటుంది. వారి డైరెక్షన్ లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా రాహుల్ జోక్యం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఎన్నికలో ఆయనకంటూ తన వర్గాన్ని భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పైగా ఆయన పాదయాత్రలో ఉన్నారు. ఎవరు పార్టీకోసం కష్టపడుతున్నారు? ఎక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందన్న అంచనాలు రాహుల్ కు రానున్నాయి. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ రాహుల్ కీలకంగా మారనున్నారు. వీటన్నింటిని అధిగమించి మల్లికార్జున ఖర్గే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకోవాలి. ఆయనకున్న అనుభవం పార్టీకి ఉపయోగపడవచ్చు. మెతకతనం కూడా అనేక చోట్ల లాభించవచ్చు. చూడాలి మరి ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమేరకు సక్సెస్ అవుతారనేది.
Tags:    

Similar News