జేపీ రీఎంట్రీ... అందుకోసమేనట

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పాలిటిక్స్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారు

Update: 2022-10-18 02:57 GMT

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన వచ్చే ఎన్నికలలో మళ్లీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన విజయవాడ నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిగా, ఈ ప్రాంతానికి చెందిన వాడిగా ఆయనను ప్రజలు ఆదరించే అవకాశాలున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయనలాంటి నేతలు అవసరం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

ఎమ్మెల్యేగా గెలిచి...
జయప్రకాష్ నారాయణ 1996లో ఐఏఎస్ పదవిని వదిలి పెట్టారు. తాను స్వంతంగా లోక్‌సత్తా పార్టీని పెట్టుకున్నారు. 2009లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఆయన అనేక అంశాలపై పోరాడారు. కూకట్ పల్లికే పరిమితం కాకుండా శాసనసభలో రాష్ట్రంలోని వివిధ సమస్యలను ప్రస్తావించిన జేపీ ప్రసంగాన్ని ఆరోజుల్లో ఎవరూ అడ్డుకునే వారు కారు. అభ్యంతరం చెప్పేవారు కారు. కౌంటర్లు కూడా ఉండేవి కావు. సూటిగా.. సుతిమెత్తంగా ఎవరికి తగలాలో వారికి తగిలేలా ఆయన ప్రసంగం కొనసాగుతుంది. ఆయనకు అన్ని విషయాలపై అవగాహన ఉండటంతో అనర్గళంగా ఏ అంశంపైనైనా మాట్లాడగలరు.
తెలంగాణలో...
అలాంటి జయప్రకాష్ నారాయణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా రాజకీయాల్లో చురుగ్గా లేరు. తన పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి అంతగా ఆదరణ లేదనే చెప్పాలి. ఆయన ఏపీకి చెందిన వారు కావడం ఒక కారణం కావచ్చు. కానీ ఏపీలో ఆయనకంటూ ఇప్పటికీ కొందరు అభిమానులున్నారు. ఆయన భావాలను, ఆలోచనలను ఆచరణలో పెట్టాలనుకునే వారు అధిక సంఖ్యలో లేకపోయినప్పటికీ ఎంతో కొంత మంది ఉన్నారు. అదే ఆయన తిరిగి పోటీ చేయాలన్న ఆలోచనకు తీసుకు వచ్చినట్లు కనిపిస్తుంది.
విజయవాడ నుంచి...
విజయవాడ పార్లమెంటు అయితే ఆయనకు అడ్వాంటేజీ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కృష్ణా జిల్లా సొంత జిల్లా కావడంతో పాటు పరిచయాలు, ఆయనకున్న పేరు, మంచితనం గెలిపిస్తాయని పార్టీ భావిస్తుంది. విభజన సమస్యలను పార్లమెంటు లో ప్రస్తావించాలంటే జయప్రకాష్ నారాయణ వంటి నేతలు అవసరమని కొన్ని పార్టీలు సయితం భావిస్తున్నాయి. ఏపీలో ఏ పార్టీకి కూడా కేంద్రంలో ఉన్న అధికార పార్టీని ఎదిరించే శక్తి లేదు. వారి అవసరాలు అలాంటివి. కానీ జేపీకి అటువంటి అవసరాలు ఏవీ ఉండవు. నిర్మొహమాటంగా మాట్లాడగలరు. విజయవాడ పార్లమెంటు అయితే గెలుపు అవకాశాలున్నాయని భావించి ఆయన పోటీకి సిద్ధమయినట్లే కనిపిస్తుంది. డబ్బులు ఇతర పార్టీలు ఖర్చు పెట్టినా ఎంపీ సీటు విషయంలో కొంత జనం ఆలోచిస్తారని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నారు. మరి పార్లమెంటులో జేపీ అడుగు పెడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News