గుడివాడలో కొడాలి నాని గుండెధైర్యం అదేనా?

గుడివాడలో కొడాలి నానికి కమ్మ సామాజికవర్గం నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయనతో దగ్గర బంధుత్వాలే ఎక్కువగా ఉన్నాయి

Update: 2021-12-05 08:02 GMT

కొడాలి నాని... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. నాని మీడియా సమావేశం అంటే.. చంద్రబాబును ఏకి పారిస్తారు. వ్యక్తిగతంగా మాటల దాడికి దిగుతారు. చంద్రబాబు ను టార్గెట్ చేస్తారు. ఇప్పుడే కాదు చంద్రబాబుపై 2014 ఎన్నికలకు ముందు నుంచి కొడాలి నాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. కొడాలి నాని వైసీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు పై ఒంటికాలిమీద లేచినా నందమూరి నడిగడ్డ మీద విజయం సాధిస్తూనే ఉన్నారు.

ఎన్టీఆర్ గడ్డ మీద....
గుడివాడ అంటేనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సొంత గడ్డ. ఆ గడ్డ మీద దశాబ్దకాలంగా పసుపు జెండాను కొడాలి నాని మాయం చేశారు. మరి కొడాలి నానికి కమ్మ సామాజికవర్గం అండలేదా? అంటే అవునని చెప్పలేం. కాదని అనలేం. ఎందుకంటే గుడివాడలో కమ్మ సామాజికవర్గం ఓట్లు 15 వేలు మాత్రమే. ఇక్కడ బీసీ, కాపులు, మైనారిటీ, ఎస్సీ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి.
కుటుంబానికి....
గుడివాడలో కొడాలి నానికి కమ్మ సామాజికవర్గం నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయనతో దగ్గర బంధుత్వాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు నాని నిత్యం జనంలో ఉంటారు. గుడవాడ ప్రజల తరువాతనే తనకు ఎవరైనా అని ఆయన బహిరంగంగానే చెప్పారు. నాని కుటుంబానికి కూడా మంచి పేరు ఉండటం కలసి వచ్చింది. అందువల్లనే కొడాలి నానిని బూతుల మంత్రిగా చిత్రీకరించినా ఆయన లైట్ గా తీసుకుంటున్నారు.
కమ్మ సామాజికవర్గంలోనూ...
గుడివాడ నియోజకవర్గంలో తన మీద కంటే చంద్రబాబు మీద కమ్మ సామాజికవర్గంలో ఎక్కువగా వ్యతిరేకత ఉందన్నది కొడాలి నాని గట్టి నమ్మకం. అందుకే కమ్మ సామాజికవర్గంలో 80 శాతం మంది తనకు అండగా ఉంటారన్న విశ్వాసంతోనే నాని నిత్యం చంద్రబాబుపై ఫైర్ అవుతారట. గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులున్నా వారిలో ఎక్కువ మంది నానికి అభిమానులేనంటారు. ఇద్దరినీ వారు వేర్వేరుగా చూడరు. అందుకే గుడివాడ పై నాని గుండెధైర్యం అదేనని చెబుతారు.


Tags:    

Similar News