థర్డ్ టైమ్ .. థమ్స్ అప్.. ఎత్తుగడ ఇదేనా?

కేసీఆర్ కు ఎన్నికల్లో నెగ్గడం ఎలాగో తెలుసు. వ్యూహాలను రచించడంలో దిట్ట. ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీలను మార్చుకుంటూ వెళతారు

Update: 2022-11-22 04:23 GMT

కేసీఆర్ కు ఎన్నికల్లో నెగ్గడం ఎలాగో తెలుసు. ఆయన వ్యూహాలను రచించడంలో దిట్ట. ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీలను మార్చుకుంటూ వెళతారు. ప్రగతి భవన్ లో ఉన్నా, ఫాం హౌస్ లో సేదతీరుతున్నా ఆయన మెదడులో అనేక ఆలోచనలు తిరుగుతుంటాయంటారు. అందుకే ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఘనతను సాధించారు. అంతేకాకుండా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన లీడర్ గా పేరు పొందారు. అందుకే కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడు ఎలా వచ్చి తమను గెలుపు రేస్ నుంచి తప్పిస్తాయో అన్న ఆందోళన విపక్ష నేతలకు నిద్రలేకుండా చేస్తుంది.

తెలంగాణ సెంటిమెంట్ తో...
2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తనకు అవకాశమివ్వాలని సెంటిమెంట్ పై కొట్టారు. ఆ సెంటిమెంట్ ఫలించింది. తెలంగాణ జాతిపితగా భావించి తొలి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను పక్కన పెట్టి తెచ్చిన కేసీఆర్ ను ఆలింగనం చేసుకున్నారు. దీంతో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ బలోపేతం అవుతున్న దశలో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. మరో ఏడాది ఎన్నికలకు సమయం ఉండగానే కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి 2018లో ఎన్నికలకు వెళ్లారు. తనకు మరోసారి అధికారం ఇవ్వాలని, ప్రతిపక్షాలు అభివృద్ధిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకుంటున్నాయని చెప్పారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లి...
దీనికి తోడు టీడీపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు మహా కూటమి కట్టడం కేసీఆర్ కు కలసి వచ్చింది. మరోసారి సెంటిమెంట్ చేతికి అందింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఆంధ్రోళ్లు వెనక్కు లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ జనంలోకి వెళ్లారు. మరోసారి విజయం సాధించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో సక్సెస్ అయ్యారు. తన పార్టీలోకి టీడీపీని విలీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను రప్పించి వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇలా రెండోసారి కూడా ఆయన తన వ్యూహాలతో సక్సెస్ అయ్యారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతానని ఆయన ప్రకటించారు.
ఎలాంటి స్ట్రాటజీ?
ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తొలి సారి జరిగిన మునుగోడు ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కొనుగోలు అంశం కలసి వచ్చింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందటూ తన ఎత్తుగడకు పదును పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలను మునుగోడు బహిరంగ సభకు తీసుకెళ్లారు. దీంతో ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం పెట్టుకున్న బీజేపీ పది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయింది. అయితే ఈసారి సాధారణ ఎన్నికలకు కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ముందున్న లక్ష్యం ఒక్కటే.. మూడోసారి అధికారంలోకి రావడం. కాంగ్రెస్ బలం పెంచడం, బీజేపీని గోకడంతోనే థర్డ్ టైమ్ థమ్స్ అప్ అనాలన్న యోచనలో ఆయన ఉన్నారు. విపక్షాలు మాత్రం కేసీఆర్ నుంచి ఎలాంటి స్ట్రాటజీలు వస్తాయన్న ఆందోళనలోనే ఉన్నారు.


Tags:    

Similar News