కేసీయార్‌ హ్యాపీనా..!

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పరిణమిస్తున్నాయా? వేగంగా మారుతున్న ఎన్నికల వాతావరణంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర రావు హ్యాపీగా ఉన్నారా? అవుననే అంటున్నాయి భారాస వర్గాలు. కేసీయార్‌ మొదట్నుంచీ ముక్కోణ పోటీపైనే ఆశలు పెట్టుకున్నారు. తమ పార్టీతో కాంగ్రస్‌, భాజపా తీవ్రంగా పోటీ పడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ తమనే అధికారం వరిస్తుందని ఆయన అనుకున్నారు.

Update: 2023-11-11 05:15 GMT

గత కొద్ది నెలలుగా కాంగ్రెస్‌ పుంజుకోవడం, భారతీయ జనతా పార్టీ డీలా పడటంతో కేసీయార్‌ అంచనాలు తప్పుతున్నట్లే కనిపించాయి. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా తప్పించడంతో భాజపా ఎన్నికల పోటీలో వెనుకబడింది. సంజయ్‌ దూకుడు స్వభావం వల్ల కమలం పార్టీకి తెలంగాణలో మైలేజీ బాగా పెరిగింది. సౌమ్యుడు కావడంతో కిషన్‌రెడ్డి రాక భాజపా శ్రేణులకు కిక్కు ఇవ్వలేదు. 2023 తీర్పు... భారాస, కాంగ్రెస్‌ మధ్య పోటీలాగా మారింది.

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు హామీలు జనాల్లోకి బాగా వెళ్లాయి. ప్రతీ అర్హురాలైన మహిళకు నెలకు 2500 రూపాయల నగదు, ఉచిత కరెంట్‌ లాంటి వాగ్దానాలతో కాంగ్రెస్‌ దూసుకుపోయింది. కేసీయార్‌ తన మ్యానిఫెస్టోను ప్రకటించినప్పటికీ వాటిలో కొత్తవి, చెప్పుకోదగ్గవేవీ లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు నిరాశ పడ్డారు. సోనియా, రాహుల్‌ గాంధీల సభలు విజయవంతం కావడంతో కాంగ్రెస్‌వాళ్లకు గెలుపు మీద ఆశలు పెరిగాయి.

గత పక్షం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మళ్లీ భాజపాను గాడిలో పెడుతున్నాయి. అగ్రశ్రేణి నాయకులు మోదీ, అమిత్‌షాలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించడం, తాము గెలిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆ పార్టీకి గ్రాఫ్‌ పెరుగుతోంది. ఈ పరిణామాలపై కేసీయార్‌ హ్యాపీగానే ఉన్నారు. ముక్కోణపు పోటీలో తమకే అవకాశాలున్నాయని ఆయన భావిస్తున్నారు. జనాన్ని ఆకర్షిస్తున్న కాంగ్రెస్‌ హామీలే ఆయన్ను కాస్త కలవర పెడుతున్నాయి.

Tags:    

Similar News