ఇద్దరు చంద్రుల కథ!

కేసీయార్‌, చంద్రబాబు ఇద్దరూ సమ ఉజ్జీలు. నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న నేతలు. 2000 సంవత్సరం వరకూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు. ఎన్టీయార్‌ వెన్నుపోటు ఎపిసోడ్‌ ముగిసిన తర్వాత కేసీయార్‌ చంద్రబాబుకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. 1999 ఎన్నికల తర్వాత.. తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత... వారిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి

Update: 2023-12-03 10:23 GMT

నేల విడిచి సాము చేసి.. బొక్క బోర్లా పడి..

కేసీయార్‌, చంద్రబాబు ఇద్దరూ సమ ఉజ్జీలు. నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న నేతలు. 2000 సంవత్సరం వరకూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు. ఎన్టీయార్‌ వెన్నుపోటు ఎపిసోడ్‌ ముగిసిన తర్వాత కేసీయార్‌ చంద్రబాబుకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. 1999 ఎన్నికల తర్వాత.. తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత... వారిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. కారణాలు స్పష్టంగా తెలియదు కానీ కేసీయార్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. ‘డిప్యూటీ స్పీకర్‌ ఇస్తాను తీసుకో’ అన్నారు బాబుగోరు. ‘నాకక్కర్లేదు, తెలంగాణ తెచ్చుకుని సీఎంని అవుతా’ అన్నారు దొరగారు.

ఆ తర్వాత 2009లో మళ్లీ కలిశారు. రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా.. ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. ఓటుకు నోటు కేసులో కొట్లాడుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాస గెలిస్తే, చంద్రబాబు ఓడిపోవడం తెల్సిందే. 2019లో చంద్రబాబు చేసిన పొరపాటే ఈ ఎన్నికల్లో కేసీయార్‌ చేశారు. చంద్రబాబులానే చావు తప్పి కన్ను లొట్టపోయి, ఫాం హౌస్‌ దొర చతికిలపడ్డారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబు తన బలాన్ని ఎక్కువగా ఊహించుకున్నారు. మోదీపై యుద్ధానికి సిద్ధపడ్డారు. ఒకే దెబ్బకు రెండు పక్షులను కొట్టాలనుకున్నారు. మోదీని తిట్టడం ద్వారా ఆంధ్రలో సెంటిమెంట్‌ రగిల్చి తెలుగుదేశాన్ని గెలిపించుకోవడం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం.. నాటి చంద్రబాబు లక్ష్యాలు. కానీ జనం చంద్రబాబుని నమ్మలేదు. తెలుగుదేశం ఆంధ్రలో ఘోరంగా పరాజయం పాలైంది. జాతీయ స్థాయిలో మరింత బలం పుంజుకున్న మోదీ ముందు చంద్రబాబు చతికిల పడాల్సి వచ్చింది.

కేసీయార్‌ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. తెలంగాణ అస్తిత్వానికి మూల కారణమైన తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి అని మార్చారు. మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో బ్రాంచీలను తెరిచారు. మోదీ మీద యుద్ధం ప్రకటించారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి, ఉసూరుమంటున్నారు. ఈ ఇద్దరు చంద్రుల్ని చూస్తుంటే... ‘ఉట్టికెగరలేనమ్మ, స్వర్గానికి ఎగిరిందట’ అనే సామెత గుర్తు రావడం లేదూ..!

Tags:    

Similar News