గ్యాప్ తగ్గిందా?

ఈరోజు కేసీఆర్, తమిళిసై చీఫ్ జస్టిస్ ప్రమాణం పూర్తయిన తర్వాత ఇద్దరూ ఒకే టేబుల్ పై కూర్చుని తేనీటి విందును స్వీకరించారు

Update: 2022-06-28 07:08 GMT

తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి సుహృద్భవ వాతావరణంలో మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న గ్యాప్ తొలిగిపోయినట్లేనన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నేడు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం సందర్బంగా రాజ్ భవన్ కు కేసీఆర్ వచ్చారు. దాదాపు 9 నెలల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ కు రావడం విశేషం. అయితే ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఆత్మీయంగా పలుకరించుకున్నారు.

పరస్పర ఆరోపణలు...
గత కొంత కాలంగా రాజ్‌భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ కూడా తెలంగాణలో జరుగుతున్న అంశాలను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ సర్కార్ గవర్నర్ ను పక్కన పెట్టింది. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు పదే పదే ఆరోపించారు కూడా. గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్నారు. అదే సమయంలో గవర్నర్ కూడా తాను ఎవరికీ భయపడేది లేదని పలుమార్లు హెచ్చరికతో కూడిన స్వరంతో చెప్పారు.
తేనేటి విందులో...
మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్ కు ప్రొటోకాల్ ప్రకారం కనీసం అధికారులు కూడా స్వాగతం పలకలేదు. ప్రభుత్వం తనకు హెలికాప్టర్ కేటాయించడం లేదని కూడా గవర్నర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ను కూడా నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్, తమిళిసై మధ్య ఆత్మీయ పలకరింపులు జరిగాయి. చీఫ్ జస్టిస్ ప్రమాణం పూర్తయిన తర్వాత ఇద్దరూ ఒకే టేబుల్ పై కూర్చుని తేనీటి విందును స్వీకరించారు. దీంతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ తగ్గిందని చెబుతున్నారు. కానీ చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం ఉన్నందునే ముఖ్యమంత్రి గౌరవ సూచకంగా వెళ్లారని అంటున్నాయి టీఆర్ఎస్ పార్టీ వర్గాలు.


Tags:    

Similar News