కవితను ఇక్కడే ఉంచింది అందుకేనా?

కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో కవిత ఆరేళ్ల పాటు ఉంటారు.

Update: 2021-11-27 07:58 GMT

కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో కవిత ఆరేళ్ల పాటు ఉంటారు. అంటే 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కవిత మళ్లీ పోటీ చేసే అవకాశాలు లేవు. తొలుత కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల కోటా కింద ఆకుల లలిత పేరును కూడా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ ఎమ్మెల్సీగా పంపడం పార్టీలో చర్చనీయాంశమైంది.

రాజ్యసభకు పంపుతారని...
రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీని కేసీఆర్ చేశారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే కల్వకుంట్ల కవిత పేరు రాజ్యసభ రేసులో విన్పించింది. గతంలో పార్లమెంటు సభ్యురాలిగా పనిచేయడంతో ఢిల్లీలో కవితకు ఉన్న పరిచయాలు పార్టీకి ఉపయోగపడతాయని భావించారు. పెద్దల సభకు పంపితే మూడేళ్లు మాత్రమే సమయం ఉంటుంది. అయితే కవిత రాజ్యసభకు వెళ్లేందుకు ఇష్టపడలేదని తెలిసింది.
మూడేళ్లు మాత్రమే....
మూడేళ్లు మాత్రమే ఉండటం, రాష్ట్ర రాజకీయాల్లో తాను కొనసాగాలని భావించడం వల్లనే తండ్రి కేసీఆర్ ను తనకు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయాలని కోరినట్లు సమాచారం. అందుకే కవితను రాజ్యసభకు పంపాలన్న ఆలోచనను చివరి క్షణంలో కేసీఆర్ విరమించుకున్నారంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఆమె స్థానంలో మరొకరికి అక్కడ ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. ప్రస్తుత మంత్రి, ఒక ఎమ్మెల్సే పేర్లు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి వినపడుతున్నాయి.
మరోసారి ఓటమి....
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికలకు వచ్చే సమయానికి బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. డీఎస్ కూడా పార్టీకి దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్ కూడా అక్కడ బలమైన పోటీ ఇచ్చే అవకాశముంది. అందుకే కవితకు మరోసారి ఓటమి పిలుపు విన్పించకుండా ఉండేందుకే కవితను ఎమ్మెల్సీని చేశారంటున్నారు. కవితకు కూడా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో ఆమె పదవిని రెన్యువల్ చేశారు.




Tags:    

Similar News