రాజమండ్రి జనసేన ఎంపీ అభ్యర్థి ఈయనేనట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు

Update: 2022-09-24 03:08 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు శాసనసభ నియోజకవర్గాల్లోనూ, అటు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అందుకే దీనిపై కసరత్తులు చేస్తున్నారు. సర్వేలు చేయించుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా అసెంబ్లీలో జనసేన జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్ బస్సు యాత్రను కూడా వాయిదా వేసుకుంది మరింత లోతుగా అధ్యయనం చేయడానికే నంటున్నారు. ఈలోపు జనసేన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

రెండు జిల్లాల్లో...
జనసేన ఆంధ్రప్రదేశ్ లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది. అక్కడ కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే కాకుండా, పవన్ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువ. అందుకే ఆ ప్రాంతాల్లోనే పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. పైగా తన బస్సు యాత్ర విషయంలో వాయిదా వేయడానికి పార్లమెంటు అభ్యర్థులను కొందరిని ముందుగా ఖరారు చేస్తే ఆ యా ప్రాంతాల్లో అందుకు అయ్యే వ్యయాన్ని కూడా భరించే వీలుంటుందని కొందరు ఇచ్చిన సూచనలను పవన్ కల్యాణ్ కూడా అంగీకరించినట్లు సమాచారం. దీంతో పాటు కేంద్రంలో పార్లమెంటు స్థానాలు తగినన్ని ఉంటే గౌరవం లభిస్తుందని కూడా పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
పొత్తులో భాగంగా....
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు దాదాపుగా ఖాయమయిందనే అనుకోవాలి. పార్టీలోనూ అదే చర్చ జరుగుతోంది. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో టీడీపీ బలంగానే ఉన్నా సరైన అభ్యర్థి లేరు. ఎవరూ ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని జనసేనకు వదిలేయాలని టీడీపీకి కూడా డిసైడ్ అయిందంటున్నారు. గతంలో పోటీ చేసిన మాగుంట మురళీ మోహన్, ఆయన కోడలు రూపాదేవిలు పార్టీలో యాక్టివ్ గా లేకపోవడంతో పొత్తులో భాగంగా జనసేనకు రాజమండ్రి సీటును కేటాయించాలన్న నిర్ణయం జరిగిపోయిందంటున్నారు.
టీ టైం మురళి...
ీఈ నేపథ్యంలోనే రాజమండ్రి పార్లమెంటు జనసేన అభ్యర్థిగా టీ టైం మురళి పేరు బలంగా వినపడుతుంది. ఈ యువకుడిది తూర్పు గోదావరి జిల్లాయే. మురళి టీం టైం పేరుతో అనేక రాష్ట్రాల్లో టీ దుకాణాలు తెరిచారు. ఫ్రాంఛైజ్‌లు ఇస్తూ బాగానే సంపాదించారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఖర్చు కూడా టీ టీం మురళి భరిస్తున్నారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆ యువకుడైతేనే ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకంతో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఇంకా పేరు బయటకు రాకపోయినప్పటికీ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా జనసేన తరుపున టీ టైం మురళి పోటీ చేస్తారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. రాజమండ్రితో పాటు నరసాపురంలోనూ పోటీ చేయాలన్నది పవన్ ఆలోచనగా ఉంది.


Tags:    

Similar News