రెడ్డి గారిలో టెన్షన్ మొదలయిందా?

జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కలేదు.

Update: 2021-11-22 04:58 GMT

జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. 14 ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అయినా అందులో రామసుబ్బారెడ్డి పేరు కన్పించలేదు. జమ్మలమడుగులో కీలక నేతగా ఉన్న రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టిక్కెట్ సుధీర్ రెడ్డికే ఇచ్చి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలన్నది జగన్ నిర్ణయం. ఈ మేరకు ఇద్దరి మధ్య రాజీ కుదిరిందన్న వార్తలు వచ్చాయి.

కడప జిల్లా నుంచి...
కానీ ఈసారి కడప జిల్లా నుంచి బద్వేలు చిన గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి లభించింది. ఇప్పటికే కడప కోటాలో సి. రామచంద్రయ్య, చిన గోవిందరెడ్డి, రమేష్ యాదవ్ లను ఎమ్మెల్సీలుగా జగన్ ఎంపిక చేశారు. రానున్న కాలంలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినా అవి కడప జిల్లాకు దక్కుతాయా? లేదా? అన్నది డౌటే. ఎందుకంటే ఇప్పటికే ఈ జిల్లాకు ఎక్కువ పదవులు దక్కాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
రానున్న కాలంలో...
దీంతో రామసుబ్బారెడ్డికి రానున్న కాలంలో ఎమ్మెల్సీ పదవి లభిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రామసుబ్బారెడ్డి 2014 ఎన్నికల్ల జమ్మలమడుగు నుంచి ఓటమి పాలయినా చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన పదవీ కాలం పూర్తికాకముందే జమ్మలమడుగు టిక్కెట్ కావాలని అనడంతో ఆయనను ఆ పదవికి రాజీనామా చేయించారు. టీడీపీలో రామసుబ్బారెడ్డికి దక్కిన గౌరవం వైసీపీలో లేదన్నది ఆయన అనుచరుల నుంచి విన్పిస్తున్న టాక్.
జమ్మలమడుగు దూరమవుతుందని...
రానున్న కాలంలోనూ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి వస్తుందా? రాదా? అన్న అనుమానం ఆయన అనుచరుల్లో బయలుదేరింది. వైసీీపీలో ఉండి పదవుల కోసం వేచి చూడటం కన్నా టీడీపీలోకి వెళ్లడమే బెటర్ అని ఆయన అనుచరులు వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వైసీపీ నుంచి కూడా రామసుబ్బారెడ్డికి ఎటువంటి సంకేతాలు అందడం లేదు. వైసీపీలో ఉంటే తనకు జమ్మలమడుగు శాశ్వతంగా దూరమవుతుందన్న టెన్షన్ మొదలయింది.


Tags:    

Similar News