జగన్ కు గెలుపు పై ధీమా అదేనా?

జగన్ రెండో సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు. మరోసారి విజయానికి వ్యూహాలను రూపొందించుకుంటున్నారు.

Update: 2022-03-20 02:23 GMT

వైసీపీ అధినేత జగన్ రెండో సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు. రెండోసారి విజయానికి అనేక వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు మేరకు వచ్చే ఎన్నికల్లో బెంగాల్ తరహా వ్యూహాన్ని అమలు పర్చాలని జగన్ నిర్ణయించినట్లు కనపడుతుంది. బెంగాల్ లో మమత బెనర్జీ మూడోసారి విజయం సాధించడానికి గల ప్రధాన కారణం అభ్యర్థులను మార్చడమే. ఎక్కువ మందిని మార్చడం కారణంగానే మమత మూడోసారి సీఎం అయ్యారు.

అదే వ్యూహంతో...
ఇప్పుడు ఏపీలో కూడా జగన్ అదే వ్యూహంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కంటే స్థానిక ఎమ్మెల్యేలపైనే ప్రజల్లో ఎక్కువగా అసంతృప్తి ఉంటుంది. వారు అందుబాటులో లేకపోవడం, ప్రధాన సమస్యలను పరిష్కరించలేకపోవడం వంటి కారణాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతి ఎన్నికల్లో ఇబ్బందిగా మారతాయి. జగన్ పార్టీకి ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో దాదాపు 70 మంది వరకూ నియోజకవర్గంలో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు.
పీకే సూచనతో...
వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ప్రశాంత్ కిషోర్ సలహా కూడా అదే. అందుకే ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో జగన్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. సర్వేల నివేదిక ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని, టిక్కెట్లు రాకున్నా పార్టీ విజయానికి కృషి చేస్తే అధికారంలోకి రాగానే పదవులు దక్కుతాయని జగన్ ఆ సమావేశంలో స్పష్టం చేశారు. పేరుకు ఈ రెండేళ్లు కష్టపడమని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో అనేక మందిని మారుస్తారన్న టాక్ పార్టీలో నడుస్తుంది.
అనేక కారణాలు...
వీరిలో కొందరిపై అవినీతి ఆరోపణలతో పాటు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, వ్యాపారాల మీదనే వారి ఫోకస్ పెట్టడం వంటి కారణాలతో ఇప్పటికే జగన్ కు నివేదికలు అందాయి. అయితే పనితీరు ఆధారంగానే అని చెప్పినా, వారిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కనీస స్థాయిలో మారిస్తేనే మరోసారి విజయం ఖాయమవుతుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే యాభై నుంచి డెబ్భయి మంది వరకూ ఈసారి టిక్కెట్లు దక్కడం కష్టమే. ఈ ప్రచారంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలయింది.


Tags:    

Similar News