త్వరలో ఆహ్వానం అందేనా?

జగన్ అంటే తొలి నుంచి కేసీఆర్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ జగన్ కు కేసీఆర్ సాయం అందించారంటారు

Update: 2022-11-17 07:12 GMT

జగన్ ను కేసీఆర్ దగ్గరకు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో జగన్ సహకారాన్ని గులాబీ బాస్ కోరుకుంటున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. జగన్ అంటే తొలి నుంచి కేసీఆర్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్ కు కేసీఆర్ సాయం అందించారంటారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రమాణస్వీకారానికి వెళ్లి పెద్దన్నగా ఆశీర్వదించి వచ్చారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా జగన్ ను ప్రత్యేకంగా కేసీఆర్ ఆహ్వానించారు. 


ఇద్దరి మధ్య రిలేషన్...

కేసీఆర్, జగన్ ల మధ్య రిలేషన్ బాగుంది. రాజకీయంగా కేసీఆర్ కొన్ని సూచనలు కూడా చేశాడంటారు. అది చంద్రబాబుపై ఆగ్రహం కావచ్చు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే జగన్ ఇబ్బంది పడతాడని భావించి ఉండవచ్చు. తన పార్టీ ఎమ్మెల్సీని కొనుగోలు చేసే యత్నం చేసిన చంద్రబాబును నిలువరించడానికి జగన్ కు సహకరించి ఉండవచ్చు. కారణాలేమైనా రాజకీయంగా మాత్రం జగన్ అంటే కేసీఆర్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. పలుమార్లు జగన్ ను ప్రగతి భవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందులో కారణాలు వెతకడానికి ఇప్పుడు ప్రయత్నించి ప్రయోజనం లేదు.
గ్యాప్ వచ్చినట్లు కనిపించినా...
తర్వాత కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపించింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎవరి దారి వారిదే అయింది. ముఖ్యంగా విభజన సమస్యలు, విద్యుత్ బకాయీల వంటి వాటిపై తలెత్తిన విభేదాలు ఇద్దరి మధ్య దూరం పెంచిందంటారు. కేసీఆర్ కు జగన్ అవసరం ఎంత ఉందో.. అదే సమయంలో జగన్ కూ కేసీఆర్ అండ అవసరం అంతే ఉంది. అయితే అది ఎన్నికల సమయం వరకే. తర్వాత ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారివే అవుతాయి. తెలంగాణలో ఉన్న బలమైన సామాజికవర్గం జగన్ సహకారంతో తనకు అండగా నిలవాలని కేసీఆర్ కోరుకుంటారు. అలాగే జగన్ కూడా ఎన్నికల సమయంలో కేసీఆర్ చంద్రబాబుపై చేసే నెగిటివ్ కామెంట్స్ సూటిగా జనంలోకి వెళతాయి. అవి జగన్ కు అడ్వాంటేజీగా మారుతుంది.

జగన్ ప్రస్తావన తెచ్చి....
అందుకే కేసీఆర్ జగన్ ప్రస్తావన తెస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో కూడా ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలోనూ జగన్ ప్రస్తావన తెచ్చారు. జగన్ కేంద్రానికి అనుకూలంగా ఉన్నా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? అని సమావేశంలో కేసీఆర్ ప్రశ్నించారు. జగన్ పై బీజేపీ కుట్రను కేసీఆర్ బయటపెట్టడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. దీంతో ఎన్నికలకు ముందు జగన్ అవసరాన్ని కేసీఆర్ మరోసారి గుర్తించినట్లు తెలిసింది. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా జగన్ సహకారాన్ని కేసీఆర్ కోరుకుంటున్నారని అర్థమవుతుంది. మరి రానున్న రోజుల్లో జగన్ కు కేసీఆర్ నుంచి ఆహ్వానం వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Tags:    

Similar News