పవన్ కల్యాణ్ సెట్ చేసేదెప్పుడు?

జనసేన పార్టీ ఏర్పడి ఏడేళ్లు కావస్తుంది. ఇప్పటి వరకూ ఏ నియోజకవర్గంలోనూ సరైన నేత లేరు.

Update: 2021-12-21 04:18 GMT

సినిమా హిట్ కావాలంటే అన్ని రకాల మసాలాలు అవసరం. కేవలం హీరో ఒక్కడితోనే మూవీ హిట్ కాదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సంగీతం అన్నీ పండాలి. అప్పుడే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రాజకీయ పార్టీ అయినా విజయం సాధించాలంటే కేవలం నాయకుడితోనే నడవదు. సరైన నేతలుండాలి. బలమైన క్యాడర్ ఉండాలి. ఈ రెండు జనసేన పార్టీకి లేవనే చెప్పాలి. జనసేన పార్టీ ఏర్పడి ఏడేళ్లు కావస్తుంది. ఇప్పటి వరకూ ఏ నియోజకవర్గంలోనూ సరైన నేత లేరు. అసలు 175 నియోజకవర్గాల్లోనూ పార్టీకి సరైన క్యాడర్ లేదు. ఓటు బ్యాంకు అంటే పవన్ కల్యాణ్ సామాజికవర్గం. ఆయన అభిమానులు మాత్రమే. కనీసం పార్టీ కార్యక్రమాలను నడిపించి, జనంలోకి పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను తీసుకెళ్లే మనుషులేరీ? ఇదే ప్రశ్న ఇపుడు జనసైనికులను వెంటాడుతుంది.

బిక్కచూపులు చూస్తున్న....
అనేక నియోజకవర్గాల్లో నాయకత్వం లేక క్యాడర్ బిక్క చూపులు చూస్తుంది. పవన్ కల్యాణ్ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిచ్చినా దానిని గ్రౌండ్ చేయాలంటే క్యాడర్ పక్క చూపులు చూస్తుంది. నిజానికి పవన్ కల్యాణ్ తొలి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు. గత ఎన్నికల్లో అది స్పష్టంగా బయటపడింది. ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో సరైన నేత లేరని ఫలితాలే స్పష్టం చేశాయి. పోనీ ఈ రెండేళ్ల నుంచి ఆ ప్రయత్నం చేశారంటే అదీ లేదు.
పొత్తు కుదుర్చుకున్నా....
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పొత్తు కుదుర్చుకున్నా పోటీ చేసే స్థానాలలో అభ్యర్థిని ఎంపిక చేయాలన్నా ఎవరన్నది చూసుకోవాల్సిన పరిస్థితి. పొత్తు కుదుర్చుకున్నా అక్కడ నమ్మకమైన నేత ఉంటేనే అవతలి మిత్రపక్షమైనా సహకరిస్తుంది. కేవలం పవన్ కల్యాణ్ ఇమేజ్ మీద ఆధారపడి అభ్యర్థిని ఎంపిక చేస్తే పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా సహకరించవు. బలమైన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాలు లేక పోలేవు.
తనను చూసి ఓటేస్తారనుకుంటే...
పవన్ కల్యాణ్ సయితం తనను చూసి జనం ఓట్లేస్తారన్న భ్రమలో ఉన్నారు. కానీ నియోజకవర్గంలో నాయకుడిని చూసే ఓటేస్తారు. పార్టీ కొంత ప్లస్ అవుతుంది. తాను ఇప్పటి నుంచి నేతలను ఖరారు చేస్తే వారు పార్టీకి చెడ్డపేరు తెస్తారన్న భయంలో ఉన్నారు. ఇప్పుడు జనసేనలో చెప్పుకోగదగ్గ నేతలు ఎవరున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ వంటి రెండు మూడు పేర్లు తప్ప మరేవీ విన్పించవు. కన్పించవు. 175 నియోజకవర్గాల్లో కనీసం పది నియోజకవర్గాల్లో సరైన నేతలు లేకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది. మరి పవన్ కల్యాణ్ పార్టీని ఎప్పుడు సెట్ చేస్తారో? అని జనసైనికులు ఎదురు చూస్తున్నారు.






Tags:    

Similar News