Ysrcp : బొత్స రిటైర్ మెంట్ కు రెడీ అయిపోయారా?

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యక్ష రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది

Update: 2022-02-23 07:18 GMT

బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. ఇదే ఆయనకు చివరిగా ప్రత్యక్ష ఎన్నిక అని ఆయన వర్గమే చెబుతుంది. రాజకీయాలకు, వయసుకు పెద్దగా సంబంధం లేకపోయినా ప్రస్తుతమున్న రాజకీయాల నుంచి తప్పుకుంటేనే బెటర్ అని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. తన సమకాలీకులు, తన కంటే వయసులో పెద్దవారు రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త వారికి అవకాశమివ్వాలని ఆయన భావిస్తున్నారు.

అసంతృప్తిగానే ఉన్నా....
గత రెండున్నరేళ్లుగా బొత్స సత్యనారాయణ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు కూడా. బొత్స సత్యనారాయణ కూడా జగన్ కేబినెట్ లో సర్దుకుపోయారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వైసీపీలో దీర్ఘకాలం తాను రాజకీయం చేయలేనని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. అందుకే ఈ సమయంలోనే కుమారుడిని రాజకీయాల్లోకి దింపి ఎదుగుదలను చూడాలని కోరుకుంటున్నారు.
తిరుగులేని నేతగా...
బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఆయన వల్లనే గతంలో కాంగ్రెస్ కాని, ప్రస్తుతం వైసీపీ కాని రాజకీయంగా రాణించగలిగింది. తాను ఈ సమయంలో హుందాగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవాలని భావిస్తున్నారు. కుమారుడు బొత్స సందీప్ ను వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారు.
వారసుడికి లైన్ క్లియర్.....
బొత్స సత్యనారాయణ తన వారసుడిని క్రియాశీలకంగా మారుస్తున్నారు. బొత్స సందీప్ వైద్య వృత్తిని అభ్యసించినా తల్లిదండ్రుల మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లుంది. ఇప్పటికే బొత్స సందీప్ సేవా కార్యకమ్రాలతో ముందుకు వెళుతున్నారు. డెవెలెప్ మెంట్ ఆఫ్ హెల్త్ , ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ వంటి వాటికోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ధీర పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలోనూ బొత్స సందీప్ విజయనగరం జిల్లాలో విశిష్ట సేవలందించారు. తండ్రి మార్గంలోనే పయనిస్తానని బొత్స సందీప్ చెబుతున్నారు. బొత్స యువసేనను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. మరి తండ్రి బొత్స రాజకీయ వారసత్వాన్ని సందీప్ నిలబెడతారా? లేదా? అన్నది రానున్న కాలంలో చూడాలి.



Tags:    

Similar News