India vs America T20 World Cup : అమెరికా వణికించింది... కానీ ఉత్కంఠ మధ్య భారత్ గట్టెక్కింది

భారత్ - అమెరికాల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆశాజనకంగా సాగలేదు

Update: 2026-02-08 02:24 GMT

భారత్ - అమెరికాల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆశాజనకంగా సాగలేదు. భారత్ గెలిచినా తృప్తి లేదు. సూర్యకుమార్ ఒక్కడే పోరాడాడు. మిగిలిన వాళ్లంతా బ్యాట్లెత్తేశారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్ లు త్వర త్వరగా అవుటయి భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ చూపిన ధైర్యమైన బ్యాటింగ్‌, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌ భారత్‌ను గట్టెక్కించాయి. టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ తొలి మ్యాచ్ అమెరికాపై గెలిచి ఊపిరి పీల్చుకున్నట్లయింది.

భారీస్కోరు చేస్తారనుకుంటే...
భారీ స్కోరు దిశగా వెళ్లాల్సిన భారత్‌ ఒక దశలో 13వ ఓవర్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పుడు కెప్టెన్‌ సూర్యకుమార్ రంగంలోకి దిగారు. ఒత్తిడిలోనూ నిలకడగా ఆడిన ఆయన 49 బంతుల్లో 84 పరుగులు చేశారు. ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సూర్య ఇన్నింగ్స్‌ వల్లే భారత్‌ 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. అదే బౌలర్లకు సరిపడ లక్ష్యమైంది.సూర్య తొలుత ఏడో వికెట్‌కు అక్షర్ పటేల్‌ (14)తో 41 పరుగులు జత చేశారు. ఆపై అర్ష్‌దీప్ సింగ్‌ (4)తో 22, వరుణ్ చక్రవర్తి (0)తో మరో 21 పరుగులు కలిపారు. డెత్ ఓవర్లలో కొత్త తరహా షాట్లతో బౌండరీల వర్షం కురిపించారు. 10వ ఓవర్‌లో 15 పరుగుల వద్ద రంజానే వేసిన రిటర్న్ క్యాచ్‌ చేజారడంతో సూర్యకు జీవితం లభించింది. దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు.
బౌలర్లు కట్టుదిట్టంగా...
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా నాలుగో వికెట్‌కు మిలింద్ కుమార్‌ (34), సంజయ్ కృష్ణమూర్తి (37) మధ్య 58 పరుగుల భాగస్వామ్యంతో కాసేపు పోరాడింది. ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది. అమెరికా 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది.జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యంతో తప్పుకోవడంతో తుది జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ 3/29తో చెలరేగారు. అర్ష్‌దీప్ సింగ్‌ 2/18, అక్షర్ పటేల్‌ 2/24తో సహకరించారు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, వెను వెంటనే వికెట్లు తీయడంతో భారత్ విజయం సాకారమయింది.
భారత్‌కు ఆరంభ షాక్
టాస్‌ గెలిచి అమెరికా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పవర్‌ప్లేలో శాడ్లీ వాన్ షాల్క్విక్‌ దెబ్బకు భారత్‌ కుదేలైంది. ఆరో ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ (20), తిలక్ వర్మ (25), శివమ్ దూబేలను ఔట్ చేసి కేవలం రెండు పరుగులే ఇచ్చారు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 46/4గా నిలిచింది. అబిషేక్ శర్మ, శివమ్ దూబే గోల్డెన్ డక్‌లతో వెనుదిరగడం నిరాశ కలిగించింది.తిలక్ వర్మ ఆరంభంలో ధాటిగా ఆడినా కొనసాగించలేకపోయారు. చివరికి సూర్య ఇన్నింగ్స్‌ భారత్‌కు పరువు నిలబెట్టింది.


Tags:    

Similar News