బాబు మాస్టర్ ప్లాన్.. అదే జరిగితే?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు.

Update: 2023-03-23 06:29 GMT

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయన వైపు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముందని అంచనా వేసి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనూరాధను బరిలోకి దింపారు. 1. కరణం బలరాం. 2. వాసుపల్లి గణేష్. ఈ ఇద్దరూ తమకు అనుకూలంగా ఓటు వేస్తారని భావిస్తున్నారు. ఎటూ అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఆనం రామనారా‍యణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తమకు మద్దతు తెలుపుతారని, దీంతో సునాయాసంగా తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించగలరన్న నమ్మకంతోనే అభ్యర్థిని ఎన్నికల బరిలో ఉంచారు. వీరితో పాటు మరికొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తారన్న వ్యూహంతోనే బాబు ఈ గేమ్‌కు తెరదీశారు.

ఆ ఇద్దరూ...
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో కొంత అసహనం వారిలో పెరుగుతుందన్న భావన చంద్రబాబులో ఉంది. అందుకే టీడీపీకి దూరమయిన ఎమ్మెల్యేల్లో ఈ ఇద్దరూ తిరిగి పార్టీ గూటికి చేరే అవకాశముందన్న మైండ్ గేమ్ ను టీడీపీ సోషల్ మీడియా ప్రారంభించింది. పంచుమర్తి అనూరాధ బీసీ కావడంతో ఆమెను ఎంపిక చేయడం వెనక కూడా ఇదే స్ట్రాటజీనని చెబుతున్నారు. చీరాల నియోజకవర్గం నుంచి కరణం బలరాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పద్మశాలీలు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే పద్మశాలీల మద్దతు అవసరం కాబట్టి కరణం తమ అభ్యర్థికి ఓటు వేస్తారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
బీసీ నేతగా...
ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా టీడీపీ నుంచి వెళ్లిన వారే. ఆయన వైసీపీలో ఇమడలేక పోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆయన వర్గానికి చెందిన వారికి ఎక్కువ మందికి టిక్కెట్లు ఇవ్వలేదు. మరోసారి టిక్కెట్ తనకు దొరుకుతుందో? లేదో వైసీపీలో చెప్పలేని పరిస్థితి. అంతేకాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో పంచుమర్తి అనూరాధకు మద్దతిస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కొందరు టీడీపీ ముఖ్యనేతలు వారితో ఇప్పటికే మాట్లాడారన్న ప్రచారం వైసీపీ నేతలు గుబులుగా ఉన్నారు.
వైసీపీ నుంచి ఈ ఇద్దరు కూడా...
వారు మాత్రమే కాకుండా గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఈ ఇద్దరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కష్టమేనని తెలిసిపోయింది. తాడికొండ నియోజకవర్గంలో మొన్నటి వరకూ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కు తిరిగి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమెకు దాదాపు అర్థమయిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో తన అసంతృప్తిని వైసీపీ హైకమాండ్ పై వెళ్లగక్కుతారేమోనన్న అనుమానం బలంగా ఉంది. అలాగే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. తనకు వ్యతిరేకంగా గూడూరులో గ్రూపు నడుపుతున్న మేరుగ మురళికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడాన్ని కూడా ఆన తప్పపుడుతున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మేరుగ మురళి సన్మాన సభకు కూడా వరప్రసాద్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన కూడా అసహనంతో తమకు ఓటు వేస్తారన్న లెక్క వేసుకుంటుంది టీడీపీ. అదే జరిగితే ...చంద్రబాబు అనుకున్న ప్లాన్ ప్రకారం వర్క్ అవుట్ అయితే పంచుమర్తి అనూరాధ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏ సంగతి ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత తెలియనుంది.


Tags:    

Similar News