తుమ్మలకు షర్మిల ఎఫెక్ట్.. మనసు మార్చుకున్న కేసీఆర్

జిల్లాలో సామాజిక సమీకరణాల పరంగా చూసినా కూడా తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ దక్కటం సందేహంగానే ఉంది

Update: 2022-08-19 03:31 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడిగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకే వెళతారన్న అంచనాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ - ప్రతిపక్ష కాంగ్రెస్, బీజెపి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఇతర నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ముమ్మరంగా బిజీ అవుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో గ్రూపుల గోల నడుస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో గత రెండేళ్లుగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి - మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య అధిపత్య పోరు తీవ్రంగా ఉంది.

తనకే సీటు అటూ...
ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు తన సొంతం చేసుకోవాలని తుమ్మల గత ఏడాదిన్నరగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ కూర్చున్నారు. అయితే అధిష్టానం నుంచి తుమ్మలకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో.. ఆయన పలుమార్లు తన అసహనం ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉండి కూడా తుమ్మల పాలేరులో ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఉపేందర్ కారు ఎక్కడంతో వచ్చే ఎన్నికల్లో పాలేరు టీఆర్ఎస్ సీటు ఎవరికి అన్నదానిపై పెద్ద సస్పెన్సే నడుస్తోంది. అయితే పార్టీ మారినప్పటి నుంచి పాలేరులో ఉపేందర్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ కీలక నేతలు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు.
పార్టీ పెత్తనం అంతా...
ఉపేంద‌ర్ వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా పార్టీ నేత‌లంద‌రిని ఒకే తాటిమీద‌కు తేవ‌డం ఆయ‌న‌కు ప్లస్ అయ్యింది. పాలేరు పార్టీ పెత్తనం అంతా ఇప్పుడు ఉపేందర్ రెడ్డి చేతుల్లోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ లో సమీకరణలు తనకు అనుకూలంగా లేవన్న నిర్ణయానికి దాదాపు వచ్చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉపేందర్ రెడ్డి పోటీ చేయటం ఖరారు అయినట్టు.. టిఆర్ఎస్ కీలక నేతలు ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
సామ‌జిక స‌మీక‌ర‌ణ‌లు కూడా ప్లస్సే...
జిల్లాలో సామాజిక సమీకరణాల పరంగా చూసినా కూడా తుమ్మలకు పాలేరు టికెట్ దక్కటం సందేహంగానే ఉంది. ఇవన్నీ ఆయన లెక్క వేసుకునే కారు దిగేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. కమ్మ సామాజిక వర్గం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రిగా పువ్వాడ అజయ్ ఉన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అదే సామాజిక వర్గానికి చెందినవారు. కీలకమైన ఖమ్మం మేయర్ కూడా కమ్మ వర్గానికి చెందిన వారే. జిల్లాల్లో పలు కీలక పదవుల్లోనూ ఈ సామాజిక వర్గం వారే ఉన్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు కూడా కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి.
రెడ్లకు ప్రయారిటీ...
ఇక కాపు వర్గం నుంచి జిల్లాకే చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక ఇప్పుడు జిల్లాలో సామాజిక సమీకరణ బ్యాలెన్స్ చేయాలంటే రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కూడా పొంగులేటికి సీటు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ ప్రయారిటీలో భాగంగా జిల్లా నుంచి ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉపేందర్ రెడ్డిని మార్చే ప్రసక్తే లేదు. మరో వైపు ఇక్కడ వైఎస్సార్టీపీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారని ప్రకటించారు. ఉపేందర్ రెడ్డి అయితేనే రెడ్డి సామాజికవర్గం ఓట్లను దక్కించుకునే అవకాశాలున్నాయి. తుమ్మలను అందుకే పక్కనపెట్టారని తెలిసింది. తుమ్మల రాజ‌కీయంగా డైల‌మాలోకి వెళుతున్నట్టే క‌నిపిస్తోంది.


Tags:    

Similar News