షేక్ అవుతున్న టాలీవుడ్....సినిమా చూపిస్తుంది ఎవరికి?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా అంశం రాజకీయ రంగు పులుముకుంది. థియేటర్లపై దాడులు టాలీవుడ్ షేక్ చేస్తున్నాయి

Update: 2021-12-23 12:46 GMT

ఇంతకీ జనం సినిమా వాళ్ల మీద ఆధారపడ్డారా? సినిమా వాళ్లే జనం మీద ఆధారపడ్డారా? అన్నది ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా అంశం రాజకీయ రంగు పులుముకుంది. సినిమా టిక్కెట్లను తగ్గిస్తూ ప్రభుత్వం 35 నెంబరు జీవో జారీ చేసింది. ఈ జీవోపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు దీనిని కొట్టివేసింది. దీంతో థియేటర్ల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కానీ ప్రభుత్వం మాత్రం కావాలని థియేటర్లపై దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తుందని సినీ పరిశ్రమలోని ఒక వర్గం ఆరోపిస్తుంది.

కక్ష సాధింపు చర్య....
ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తుందని సినీ పరిశ్రమలో కొందరు ఆరోపిస్తున్నారు. వినోదానికి సంబంధించిన అంశంపై ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా థియేటర్లను పరిశీలించి సీజ్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతోంది. చిన్న చిన్న కారణాలను చూపి పదుల సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ప్రభుత్వంపై ఒక వర్గం ఆరోపణలు చేస్తుంది.
సామాన్యులకు..
కానీ డబ్బులు ప్రజల నుంచి తీసుకుని ఏమాత్రం సదుపాయాలు కల్పించని థియేటర్లపైనే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కనీసం సదుపాయాలు లేకపోవడం, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచకపోవడం, థియేటర్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవడం వంటి వాటిపై ప్రభుత్వం సీిరియస్ గా ఉంది. ఇవన్నీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని చెబుతున్నాయి. సామాన్య ప్రజలకు వినోదాన్ని అతి తక్కువ ధరకు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది.
కోట్లు సంపాదిస్తున్నారు కానీ....
కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించే సినీ పరిశ్రమ ప్రజలకు కనీస సదుపాయం కల్పించడంలో విఫలమవుతుందన్న విమర్శలు ఎప్పటి నుంచో విన్పిస్తున్నాయి. ప్రభుత్వం పై కొందరు కక్ష కట్టి అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని మంత్రి కొడాలి నాని వంటి వారు అంటున్నారు. సినిమా తీసిన వాళ్లందరూ నష్టపోరని, అలాగే కిరాణా షాపులన్నీ లాభాల్లో నడవవని అని పరోక్షంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద సినిమా థియేటర్లలో జరుగుతున్న దాడులు టాలివుడ్ ను షేక్ చేస్తున్నాయి. పెద్ద సినిమాలే దీని వల్ల నష్టపోతాయని వారంటున్నారు.


Tags:    

Similar News