వివేక్ హ్యాండ్ మంచిదనేనా?

ఉప ఎన్నిక తెలంగాణలో వచ్చిందంటే చాలుహైకమాండ్ వివేక్ కు ప్రాధాన్యత ఇస్తుంది. ఆయనకు బాధ్యతలను ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడదు

Update: 2022-10-11 07:21 GMT

భారతీయ జనతా పార్టీలో మాజీ ఎంపీ వివేక్ కీలకంగా మారబోతున్నారా? ఉప ఎన్నిక వస్తే ఆయన పేరు ప్రముఖంగా వినిపించడం వెనక కారణం ఏంటి? ఆర్థిక వనరులతో పాటు సామాజికవర్గాల సమీకరణను కూడా వివేక్ చేయగలరనా? లేక ఆయన వద్ద ప్రత్యేక వ్యూహాలేమైనా ఉన్నాయా? అన్న చర్చ భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. ఉప ఎన్నిక తెలంగాణలో వచ్చిందంటే చాలు పార్టీ హైకమాండ్ వివేక్ కు ప్రాధాన్యత ఇస్తుంది. ఆయనకు ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించేందుకు ఏ మాత్రం వెనకాడదు. అంతా తానే అయి వివేక్ నడిపిప్తారన్న నమ్మకం కావచ్చు.

టీఆర్ఎస్ నుంచి...
మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం వివేక్ కాంగ్రెస్ లో దీర్ఘకాలం ఉన్నారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో ఆయనకు పొసగక బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయనకు అధినాయకత్వం ప్రయారిటీ మామూలుగా ఇవ్వడం లేదు. ప్రతి ఉప ఎన్నికకు ఆయన గెలిపించే బాధ్యతను అప్పగించారు. దుబ్బాక నుంచి హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకూ ఆయనకే బాధ్యత ఇచ్చారు. వివేక్ కూడా ఉప ఎన్నిక పూర్తయి ఫలితం వెలువడేంత వరకూ అభ్యర్థి ఎవరైనా ఆయన వెంటే ఉండి కథ అంతా నడిపించారు. దుబ్బాక, హుజూరాబాద్ లో అభ్యర్థులు స్ట్రాంగ్ అవ్వడంతో పాటు వివేక్ చేయి వేయడం వల్లనే గెలిచిందన్న అభిప్రాయం అధినాయకత్వంలో కలిగింది.
గతంలో రెండు ఉప ఎన్నికలు...
గతంలో దుబ్బాక ఉప ఎన్నికలోనూ వివేక్ కీలకంగా వ్యవహరించారు. రఘునందన్ పై సానుభూతి బీజేపీ విజయానికి పనిచేసినా ఎన్నికల వ్యూహాల అమలులో వెనక వివేక్ ఉన్నారని గ్రహించారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన స్థానంలోనూ అదే కుటుంబానికి టిక్కెట్ ఇచ్చినా గెలిచారన్న అభిప్రాయం హైకమాండ్ కు కలిగింది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కాండిడేట్. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించారన్న సానుభూతి ఉంటుంది. కానీ వివేక్ ను ఆయన వెనకే నీడలా ఉంచి అధినాయకత్వం కథ నడిపించింది. అక్కడ కూడా బీజేపీకి అధికార పార్టీపై విజయం లభించింది.
ప్రస్తుతం మునుగోడుకు...
దీంతో మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను వివేక్ ను అధినాయకత్వం నియమించింది. ఆయన ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత. ఆ విషయంలో వివేక్ చేయాల్సిందేమీ లేదు. కానీ కేవలం వ్యూహరచనతో పాటు సామాజికవర్గం ఓట్లను కూడా ఆకట్టుకునేందుకు ఆయనకు బాధ్యతలు అప్పగించిందని చెబుతున్నారు. వివేక్ కు ఉప ఎన్నికల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతో ఆయన మీదనే అధినాయకత్వం కూడా భారం మోపుతుందన్నది పార్టీలో వినిపిస్తున్న అభిప్రాయం. మరి మునుగోడు ఉప ఎన్నికలో వివేక్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News