ఆ నివేదికలో ఏముంది…?

ఆర్టీసీలో సమ్మెను ఉపసంహరింపచేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అంతే మొండిగా కార్మికులు ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తేనే సమ్మె విరమిస్తామని జేఏసీ నేతలు గట్టిగా చెబుతున్నారు. [more]

Update: 2019-10-07 09:56 GMT

ఆర్టీసీలో సమ్మెను ఉపసంహరింపచేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అంతే మొండిగా కార్మికులు ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తేనే సమ్మె విరమిస్తామని జేఏసీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే మొండిగా వ్యవహరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విలీనం చేసే ప్రసక్తే లేదంటున్నారు. ఇలా ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం సమ్మెపై వార్ కు దిగినట్లు కనిపిస్తోంది. దీంతో సర్కార్ మరోసారి ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ కమిటీని వేసింది. ఆ కమిటీ ఆర్టీసీపై పూర్తి నివేదికను ఇవ్వమని ఆదేశించింది. మరి ఆ నివేదికలో ఏముంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పండగ తర్వాతే….

ఈ నెల 5నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు పండుగ సందర్భంగా రెండు రోజులు ఆందోళనలను సడలించారు. ఈ నెల 6, 7 తేదీలకు షెడ్యూల్ ప్రకటించి ఆ దిశగానే అడుగులు వేశారు. రాజకీయ నేతలను కలిసి వారి గోడును వెల్లబోసుకున్నారు. ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గన్ పార్కు వద్ద కూడా అమర వీరులకు నివాళులు అర్పించేందుకు జేఏసీ నేతలు వెళ్లగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ల నుంచి విడుదలైన నేతలు మరోసారి సమావేశమై పండగ తరువాత కార్మికులు భవిష్యత్ కార్యచరణ ఏంటో వెల్లడిస్తామని ప్రకటించారు.

బంగారు భవిష్యత్తుకోసం….

ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటించినా ఎవరూ కూడా అదరలేదు, బెదరలేదు. సర్కార్ సమ్మెను విచ్చిన్నం చేయడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించినా కార్మికులంతా సంఘటితంగా ఏకమై సమ్మె చేస్తున్నారు. నాయకులు సైతం తెలంగాణ ఉద్యమ సమయంలోనే బంగారు తెలంగాణ కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు చేశామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆర్టీసీ కార్మికుల బంగారు భవిష్యత్తుకోసం ఉద్యమం చేయలేమానని ప్రశ్నిస్తున్నారు.

మరో కమిటీకి సర్కార్ మొగ్గు…..

మరోవైపు ప్రభుత్వం అసలు ఆర్టీసీలో ఏం జరుగుతోంది. లాభాల బాటలో ఎలా నడపాలనే దానిపై పూర్తి నివేదిక కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సునీల్ శర్మ కమిటీనీ నియమించారు. ఈ కమిటీ ఇవ్వాళ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రైవేటు బస్సులను నడుపుతున్నా అవి ప్రయాణికులకు సరిపోవడం లేదని, నడిపే బస్సుల్లోనూ దోపిడీ జరుగుతుందనే విషయాలు సునీల్ శర్మ కమిటీ దృష్టికి వచ్చాయి. ఈ నెలలో ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందలేదు. వాటి బకాయిలు ఎంత….? అవి ఎప్పుడు ఇవ్వాలి….? మరోసారి జేఏసీ నేతలతో చర్చించాలా అనే విషయాలపై సునీల్ శర్మ కమిటీ నివేదిక ఇవ్వనుంది. సమ్మెను సడలించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనే దానిపైనా కమిటీ ఆలోచిస్తోంది. ఇప్పటికే తాత్కాలిక ఉద్యోగులను తీసుకుంటున్నఆర్టీసీ ఆ తర్వాత వారి పరిస్థితి ఏంటి…? మళ్లీ వాళ్లతో ముప్పు వస్తుందా….? కార్మికులు కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపైనా కమిటీ వివరంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మరి నివేదిక తర్వాతైనా సమ్మె సడలించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

 

Tags:    

Similar News