Godavari Pushkarams : గోదావరి పుష్కరాలకు తేదీల నిర్ణయం.. వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు
గోదావరి పుష్కరాలకు తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి పుష్కరాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని భావించింది.
గోదావరి పుష్కరాలకు తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి పుష్కరాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని భావించింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సారి పుష్కరాల కోసం దాదాపు ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా, మహిళలకు ప్రత్యేకంగా స్నానఘాట్లను పరిశీలిస్తుంది.
ఎక్కడైనా స్నానాలు చేసేలా...
2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనుంది. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం దాదాపు 94 కోట్ల రూపాయలతో ప్రతిపాదలు సిద్దం చేసింది. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే వంద కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు 271.43 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే యాత్రికులు బస చేసేందుకు తాత్కాలిక టెంట్లను మహా కుంభమేళా తరహాలో చేయాలని కూడా భావిస్తుంది.
రాజమండ్రిలోనే కాకుండా...
దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమయింది. ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామంటున్న అధికార యంత్రాంగం టిక్కెట్లు కూడా ముందు నుంచి బుక్ చేసుకోవడానికి వీలుగా ప్రకటించనుంది. గోదావరి తీరంలో ఎన్ని పుష్కర్ ఘాట్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం చేయనున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక విశిష్టతను అనుసరించి ఘాట్ లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ఘాట్లలో అవసరమైన రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరూ రాజమండ్రికి కాకుండా మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్లేలా ప్రచారం కల్పించేందుకు ముందస్తు నుంచే చర్యలు తీసుకోవాలని నిశ్చయించింది.