మళ్లీ అవంతికి అవస్థలేనా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారన్న వార్త సంచలనమే అయింది. ఆయన రాకతో అవంతి శ్రీనివాసరావుకు ఇబ్బందులు తప్పవు

Update: 2022-11-26 08:08 GMT

పార్టీలు మారడం ఒక వ్యసనం. అది విజయాలకు కూడా ఒక్కొక్కసారి దారి తీస్తుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారన్న వార్త సంచలనమే అయింది. ఆయన ఇప్పటికి అనేక పార్టీలు మార్చారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యంలో చేరారు. అక్కడి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అనంతరం రాష్ట్ర విభజన జరిగిన సమయంలో గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరి భీమిలీ నుంచి విజయం సాధించి ఏకంగా చంద్రబాబు మంత్రి వర్గంలో ముఖ్యమైన పదవిని పొందారు. మాజీ మంత్రి నారాయణకు వియ్యంకుడు అయిన గంటా శ్రీనివాసరావు పార్టీలే కాదు తరచూ నియోజకవర్గాలను కూడా మారుస్తుంటారు. వచ్చే నెలలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారంటున్నారు.


టీడీపీకి దూరంగా...

గత ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. కానీ ఈ మూడున్నరేళ్లలో టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూనే వస్తున్నారు. అలాగని వైసీపీకి దగ్గర కాలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గంలో తన మనుషుల చేత పని కానిస్తున్నారు. అంటే ఆయనకు మరోసారి ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన ఆయన చేయకపోవడం వల్లనే పెద్దగా నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదంటారు. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా గంటా శ్రీనివాసరావును పెద్దగా పట్టించుకోవడం లేదు.
కేకే రాజును ప్రకటించడంతో...
ఉత్తర నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు పోటీ చేస్తారని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అంటే ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు లేనట్లే. ఇక ఆయన తనకు పట్టున్న భీమిలి నుంచి పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే అవంతిని భీమిలి నుంచి తప్పించి గంటాకు అవకాశాలను వైసీపీ హైకమాండ్ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు పార్టీ నేతలు. ఇటీవలే పార్టీ అధినాయకత్వం అవంతిని జిల్లా అధ్కక్ష బాధ్యతల నుంచి తప్పించింది.

అవంతిని మారుస్తారా?
దీంతో గంటా శ్రీనివాసరావు వైసీపీ చేరిన తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు భవిష్యత్ ఏంటన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అనకాపల్లి ఎంపీగా అవంతి శ్రీనివాసరావు పనిచేశారు. మరోసారి ఆయనను ఎంపీ పదవికి జగన్ పంపుతారా? లేదా మరొక నియోజకవర్గానికి అవంతిని మారుస్తారా? అన్న టెన్షన్ అవంతి వర్గీయుల్లో కనపడుతుంది. అవంతి, గంటాలకు క్షణం పడదు. ఆయన వైసీపీలో చేరితే ఇద్దరికీ ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం జరగదన్న టాక్ కూడా వినపడుతుంది. మొత్తం మీద గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే అవంతి శ్రీనివాసరావుకు మాత్రం అవస్థలు ఎదురయ్యేనట్లేనని చెప్పక తప్పదు.


Tags:    

Similar News