వంశీ చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టారా?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు

Update: 2021-12-08 02:26 GMT

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నిద్రపోనిచ్చేట్లు లేరు. వంశీ వ్యాఖ్యలతో చంద్రబాబు పార్టీకి ఎంతో కొంత సానుభూతిని తెచ్చుకుందామనుకుంటే సారీ చెప్పేసి టీడీపీని డైలమాలో పడేశారు. చంద్రబాబు తన భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో దూషించిన విషయాన్ని ఎన్నికల వరకూ సాగదీయాలని భావించారు. ఈ మేరకు త్వరలో ప్రతి నియోజకవర్గంలో గౌరవ సభలను నిర్వహించాలని నిర్ణయించారు.

సారీ చెప్పడంతో...
కానీ వల్లభనేని వంశీ హఠాత్తుగా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా తాము అసెంబ్లీలో ఆమెను దూషించలేదని, ఆమె ఫీలయితే తాము కన్నీళ్లతో కాళ్లు కడుగుతామని కూడా చెప్పారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. గౌరవ సభలు నిర్వహించాలా? లేదా? అన్నది స్ట్రాటజీ కమిటీలో నిర్ణయించే అవకాశముంది.
ముగిసిన అథ్యాయమంటూ....
వైసీపీ మాత్రం భువనేశ్వరి అంశం ముగిసిన అధ్యాయమని చెబుతున్నారు. అసెంబ్లీ బయట అన్న మాటలకు వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారని, అసెంబ్లీలో భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని, కావాలంటే అసెంబ్లీ రికార్డులు పరిశీలించుకోవచ్చని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. దీంతో చంద్రబాబు అండ్ టీం కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. ఐదు శాతం వంశీ అల్లరి చేస్తే, చంద్రబాబు 95 శాతం తన భార్య పేరును బయటకు లాక్కొస్తున్నారని కూడా వైసీీపీ నేతలు అనడంతో గౌరవ సభలు నిర్వహించాలా? వద్దా? అన్న దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.
గౌరవ సభల స్థానంలో....
గౌరవ సభల స్థానాల్లో నాలుగు చోట్ల పెద్ద బహిరంగ సభలు పెట్టి తానే హాజరై ప్రభుత్వ వైఫల్యాలతో పాటు భువనేశ్వరి అంశాన్ని ప్రస్తావిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ గౌరవ సభలను పెట్టాలని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. తాను కాకుండా భువనేశ్వరి అంశాన్ని గౌరవ సభల్లో మరొకరు ప్రస్తావించడం కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. మరి త్వరలో దీనిపై నిర్ణయం ఉంటుందంటున్నారు.


Tags:    

Similar News