పవన్‌.. ఇదేం భాష?

ఓ పార్టీ అధ్యక్షుడిగా వీధి రౌడీ భాష మాట్లాడటం ఎంతవరకూ సబబు అంటూ కాపు ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం..

Update: 2023-06-20 09:55 GMT

mudragada fires on pawan's language

జనసేనానిపై విరుచుకుపడ్డ ముద్రగడ

ఓ పార్టీ అధ్యక్షుడిగా వీధి రౌడీ భాష మాట్లాడటం ఎంతవరకూ సబబు అంటూ కాపు ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నించారు. మంగళవారం జనసేనానికి రాసిన బహిరంగ లేఖలో ముద్రగడ పలు అంశాలపై పవన్‌ వైఖరిని తప్పు పట్టారు.పవన్‌ ప్రసంగాలలో ‘తొక్క తీస్తా, నార తీస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా’ అంటున్నారు, ఇప్పటి వరకు ఎంతమందిని కింద కూర్బోబెట్టారో, గుండు గీయించారో చెప్పాలని ఆయన పవన్‌ని నిలదీశారు.

గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ముద్రగడ రాసిన లేఖ సంచలనమైంది. తాను ఏ పార్టీకి, వ్యక్తికి అమ్ముడు పోలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో ఆయన ప్రతినిధులు వచ్చి కాపులకు వేల కోట్ల సాయం చేస్తామని అన్నారని, తాను కాపు నేతలకు ముఖ్యమంత్రి పదవి అడిగానని, అది తన నిబద్ధత అని పద్మనాభం పేర్కొన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై పవన్‌ చేసిన విమర్శలను ముద్రగడ ఆక్షేపించారు. ద్వారంపూడి కుటుంబమంతా కాపు ఉద్యమానికి సాయం చేసిందని, ఉద్యమ సమయంలో ఎన్నో వాహనాలను పంపారని చెప్పారు. ఎమ్మెల్యేను తిట్టడం మాని, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ ప్లాంట్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన పవన్‌కు హితవు పలికారు.

బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్‌ తరచూ అంటున్నారని, ఇప్పుడు జనసేకు మద్దతు ఇవ్వండి, ముఖ్యమంత్రిని అవుతా అంటున్నారని, వాళ్లతో కలిసి పోటీ చేస్తే పవన్‌ ఎలా ముఖ్యమంత్రి అవుతారని ఆయన ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసి ముఖ్యమంత్రి పదవిని ఆశించాలని, పొత్తులతో పోటీలో అది సాధ్యం కాదని ముద్రగడ వెల్లడిరచారు. ఈ లేఖ వల్ల పవన్‌ అభిమానులకు కోపం రావచ్చని, తనను వాళ్లు తుద ముట్టించడానికి ప్రయత్నించవచ్చని పేర్కొంటూ లేఖను ముద్రగడ ప్రారంభించడం గమనార్హం.


Tags:    

Similar News