జగన్ లో చూడని రెండో కోణం...?
రెండు రోజులుగా జగన్ కొంత ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు. నరసరావుపేట, నంద్యాల సభల్లో జగన్ లో కొంత అసహనం కన్పించింది.
మామూలుగానే జగన్ ఎక్కువగా మాట్లాడరు. గత మూడేళ్ల నుంచి ఆయన మీడియా సమావేశాలకే దూరంగా ఉంటూ వస్తున్నారు. మీడియా సమావేశాలంటే భయం కాకపోవచ్చు. అనవసరమన్న భావనతోనే ఆయన దూరంగా ఉండి ఉంటారు. ఇక విపక్షాలు చేసే విమర్శలకు కూడా జగన్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలకు కూడా జగన్ మంత్రుల చేతనో, ఎమ్మెల్యేల చేతనో సమాధానం ఇప్పించి తన రేంజ్ అది కాదని చెప్పకనే చెబుతారు.
కాని రెండు రోజుులుగా....
అయితే అసెంబ్లీ సమావేశాలు, ఎక్కడైనా బహిరంగ సభల్లో మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తారు. కానీ చాలా తక్కువ సార్లు ఆయన విమర్శలకు సమాధానమిస్తారు. అంటే విపక్షాల విమర్శలను జగన్ కావాలనే ఇగ్నోర్ చేస్తారన్నది వాస్తవం. అయితే గత రెండు రోజులుగా జగన్ కొంత ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు. నరసరావుపేట, నంద్యాలలో జరిగిన సభల్లో జగన్ లో కొంత అసహనం కన్పించింది.
విపక్షాలు పొగుడుతాయా?
విపక్షాలన్న తర్వాత ప్రభుత్వాన్ని ప్రశంసించవు. పొగడవు. విమర్శలే చేస్తాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేసిందదే. విపక్షాలు తాము అనుకున్నవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఎక్కువ గా ప్రయత్నిస్తారు. కాని గత రెండు రోజుల నుంచి జగన్ లో అసహనం కన్పిస్తుంది. ఏపీిని మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు చెప్పడాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ పై కూడా సెటైర్లు వేశారు. ఇద్దరూ దొంగల ముఠా అని, హైదరాబాద్ లో కూర్చుని ఏపీపై విషం కక్కుతున్నారని ఫైర్ అయ్యారు.
ఎన్నడూ వినని మాట....
ఇక జగన్ నోటి నుంచి ఎప్పుడూ వినని మాట కూడా వినిపించింది. నంద్యాల సభలో ఎవరు ఏకమైనా తన వెంట్రుకను కూడా పీకలేరంటూ జగన్ కొంత హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ నోటి నుంచి ఇటువంటి మాటలు ఎప్పుడూ వినలేదు. ఆయన సన్నిహితులు కూడా అవాక్కయ్యారు. తనకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయనే జగన్ ఫ్రస్టేషన్ కు లోనయ్యారంటున్నారు. మొత్తం మీద జగన్ లో అసహనం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.