థియేటర్లు లోడింగ్.. ఫుల్ హ్యాపీస్

కరోనా నుంచి చిత్ర పరిశ్రమ కోలుకుంటున్నట్లే కనిపిస్తుంది. తిరిగి కలెక్షన్లు ఊపందుకున్నాయి.

Update: 2023-01-30 12:38 GMT

కరోనా నుంచి చిత్ర పరిశ్రమ కోలుకుంటున్నట్లే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకూ థియేటర్లకు రావడానికే ప్రేక్షకులు జంకే వారు. అందునా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే విపరీతమైన పిచ్చి.... క్రేజ్.... అందుకు కారణమూ లేకపోలేదు. జీవితంలో తక్కువ ఖర్చుకు లభించే ఒకే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అదే కాబట్టి సినిమా హాళ్లు ఫుల్లుగా కళకళలాడేవి. కానీ సాధారణ థియేటర్ల స్థానంలో మల్టీప్లెక్స్ లు వెలిశాయి. రేట్లు పెంచేశారు. అయినా సరే సినిమా పిచ్చి జనం థియేటర్లకు ఎగబడి పోతున్నారు. కానీ కరోనా సమయం నుంచి థియేటర్ కు రావడానికి వెనుకంజ వేశారు.


ఓటీటీలకు అలవాటు..

అదే సమయంలో ఓటీటీ లు కూడా రావడంతో ఇంట్లో కూర్చుని సినిమాలను చూడొచ్చన్న భావనతో చాలా కాలం వరకూ థియేటర్లకు వెళ్లడం మానేశారు. థియేటర్లలోనే తమ సినిమాలు చూడాలని అగ్రహీరోలు పెద్ద క్యాంపెయిన్ చేసినా పెద్దగా ఫలితం కన్పించలేదు. సినిమాకు పెట్టే ఖర్చు వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో నిర్మాతలు కూడా కొంతకాలం ఫిలిం ప్రొడక్షన్ పై వెనుకంజ వేశారు. కానీ ఏకైక ఎంటర్‌టైన్ మెంట్‌ ను ప్రజలు వదులుకోరన్నది మరోసారి రుజువవుతుంది. తమ ఇష్టమైన హీరోను వెండితెరపై చూడాలన్న కాంక్షను తిరిగి వారిని థియేటర్ బాట పట్టిస్తుంది. దీంతో థియేటర్లకు తిరిగి పూర్వ వైభవం వస్తుందంటున్నారు.
బిగ్ స్క్రీన్ లో చూస్తేనే...
సినిమాకు వెళితే కాస్త ఉపశమనం. సౌండ్ సిస్టమ్, పెద్ద స్క్రీన్ మీద తమ అభిమాన హీరోను చూస్తే ఆ కిక్కే వేరు. కేవలం సినిమా చూడటమే కాదు. వెళ్లి మధ్యలో స్నాక్స్.. వచ్చే టప్పుడు లంచ్, డిన్నర్ చేసి వచ్చే వీలుంది. సినిమా అందరి జీవితంలో భాగమయిపోయిన వేళ కరోనా దెబ్బకు థియేటర్లు మూలన పడ్డాయి. ప్రొడ్యూసర్ నష్టాలను చూశాడు. డిస్ట్రిబ్యూటర్ తలకిందులయ్యాడు. ఇక థియేటర్ యజమాని అయితే ఈగలు తోలుకోవాల్సిన పరిస్థిితి ఏర్పడింది. దీంతో అనేక థియేటర్లను అపార్ట్‌మెంట్లగానో, కమర్షియల్ కాంప్లెక్స్ లుగానో మార్చేశారు. చిత్ర పరిశ్రమ తిరిగి కోలుకుంటుందా? అన్న అనుమానం అందరిలోనూ కలిగింది.

కలెక్షన్ల సునామీ...
కానీ ఊహించని విధంగా సంక్రాంతికి విడుదలయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి హిట్ టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్య అయితే రెండు కోట్ల కలెక్షన్లు దాటి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. వీరసింహారెడ్డి కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇక బాలివుడ్ లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తంది. బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అయినట్లే కనిపిస్తుంది. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఐదు రోజుల్లోనే ఐదు వందల కోట్లను దాటేసింది. దీంతో సినిమా థియేటర్లకు ఇక మంచి రోజులు వచ్చినట్లేనని భావిస్తున్నారు. నిర్మాతలు, హీరోలు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. చిత్ర పరిశ్రమ మీద వేల సంఖ్యమంది ఆధారపడి జీవిస్తుండటంతో తిరిగి పూర్వవైభవం రావడం శుభపరిణామమేనని అనుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News