పాదయాత్రతో ఫలితం ఉంటుందా?

అమరావతి రాజధాని రైతులు నాలుగు రోజులు పాదయాత్రకు విరామం ప్రకటించారు. న్యాయస్థానంలో తేల్చుకునేందుకే బ్రేక్ ఇచ్చారు

Update: 2022-10-23 04:04 GMT

నిరసనలు తెలియజేయవచ్చు. పాదయాత్రలు నిషిద్ధం కాదు. కానీ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు అలాంటిది. కానీ ఏదైనా శృతి మించితే అది అనర్థాలకు దారి తీస్తుంది. ఇప్పుడు అమరావతి రాజధాని రైతుల పాదయత్ర కూడా అలాంటిదిగానే చూడాల్సి ఉంటుంది. అమరావతి రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. తాము త్యాగం చేశామంటున్నారు. దానికి కూడా ఎవరూ కాదనరు. కానీ మరొక ప్రాంతంలో ఉన్న సెంటిమెంట్ ను కాదనేలా యాత్ర చేయాలనుకోవడమే ఇప్పుడు రచ్చకు కారణమయింది.

విరామం ప్రకటించి...
అమరావతి రాజధాని రైతులు నాలుగు రోజులు పాదయాత్రకు విరామం ప్రకటించారు. న్యాయస్థానంలో తేల్చుకునేందుకే తాము బ్రేక్ ఇచ్చామని చెబుతున్నారు. తమ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి నిరసనలు ఎదురు కాలేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి రాజధానుల ప్రకటన ప్రభుత్వం చేయలేదు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకూ పాదయాత్ర ప్రశాంతంగానే సాగింది. కానీ తిరుపతికి వచ్చే సరికి కొంత నిరసనలు ఎదురయ్యాయి. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని కొంత నిరసన ధ్వనులు వినిపించాయి.
ఈ పర్యటనతో...
ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. అమరావతి టు అరసవిల్లి అంటూ పాదయాత్రగా బయలుదేరారు. 600 మంది రైతులతో పాదయాత్ర చేయాలని అందరికీ గుర్తింపు కార్డులు ఉండాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇతర పార్టీల నేతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. అయితే తమ ప్రాంతానికి వస్తున్న రాజధానిని అడ్డుకోవడానికి చేస్తున్న యాత్రగా కొన్ని వర్గాలు భావించి నిరసనలు తెలియజేస్తున్నాయి. ఫలితంగా పాదయాత్ర సమయంలో అనేక చోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచే వారి యాత్ర సాఫీగా సాగడం లేదు.
ఇరు పక్షాల నుంచి...
ఇక విశాఖ పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ప్రతిపాదించడంతో అక్కడకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందోనని పోలీసులు సయితం అనుమానిస్తున్నారు. ఇది రైతులు తమ డిమాండ్ కోసం చేసే యాత్రలా లేదు. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణ యాత్రగా తయారయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు పాదయాత్ర లేకుండానే తమ నిరసనలను అమరావతిలోనే ఉండి తెలియజేయవచ్చు. న్యాయస్థానాలు ఎటూ ఉన్నాయి. వాటి ద్వారా తాము డిమాండ్లను నెరవేర్చుకునే వీలుంది. కానీ ఇప్పుడు పాదయాత్ర ద్వారా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుందని పోలీసు అధికారులు సయితం నివేదికలు పంపుతున్నారు.
ఇరకాటంలో పోలీసులు...
ఎవరినీ అదుపు చేయలేని పరిస్థితి. రెండు పక్షాల నుంచి కవ్పింపు చర్యలు ఉన్నాయి. పైగా పాదయాత్రలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. రాజమండ్రిలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఇరువైపుల నుంచి వాటర్ బాటిల్స్ విసురుకున్నారు. మధ్యలో నలిగిపోయేది పోలీసు యంత్రాంగమేనన్నది గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా తాము పాదయాత్ర చేసినంత మాత్రాన డిమాండ్లు సాధించుకుంటామంటే అది జరగని పని అని వారికీ తెలుసు. ఏదైనా న్యాయస్థానం ద్వారానే పోరాటం చేసి సాధించుకుంటే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News