ఉండవల్లి వార్నింగ్.. జగన్ పట్టించుకుంటేనే?

ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారారు. ఆయన చేసే విమర్శలకు వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంది

Update: 2022-02-09 13:07 GMT

ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక రాజకీయ నేత మాత్రమే కాదు. ఆయన అంచనాలు నిజమవుతాయి. రాజకీయంగా ఉండవల్లి చేసే ప్రతి కామెంట్ జనంలోకి బాగా చొచ్చుకుపోతాయి. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ కు రాజకీయ పార్టీల్లో ఒక రేంజ్ ఉన్న మేధావిగా గుర్తింపు ఉంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును రాజకీయంగా ఉండవల్లి ఇబ్బంది పెట్టారు. ఆయన చేసిన ప్రతి పనికీ ఇబ్బందికరంగా మారారు. చంద్రబాబు ఓటమికి గల కారణాల్లో ఉండవల్లి ఒకరన్నది అందరూ ఒప్పుకునే విషయమే.

వైసీపీకి ఇబ్బందికరంగా
ఇప్పుడు అదే ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీీపీకి ఇబ్బందికరంగా మారారు. ఇబ్బందికరమంటే ఉన్న విషయాలను కుండబద్దలు కొడుతున్నారంతే. జగన్ పాలనపై గత కొద్ది రోజులుగా ఉండవల్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి అప్పుల వరకూ ఆయన చేసే ప్రతి వ్యాఖ్య జగన్ సర్కార్ కు సూటిగా తగులుతుంది. సామాన్యుడికి అర్థమయ్యేలా చెబుతుండటంతో ఉండవల్లి కామెంట్స్ తో అధికార వైసీపీ ఇరుకున పడుతుంది.
అప్పులే ఉరితాళ్లు...
ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అప్పులతో భవిష్యత్ లో ప్రజలకు ఇబ్బంది తప్పదని ఉండవల్లి హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికవేత్త అయిన జగన్ వద్ద ఏమైనా మంత్రదండం ఉంటే చెప్పాలని, కనీసం తన వంటి వారికైనా భరోసా ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుతున్నారు. ఉండవల్లి విమర్శలకు వైసీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండటం లేదు. అంటే ఉండవల్లి మాటలను వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది.
విద్యుత్తు పైనా....
ఇప్పడు తాజాగా ఏపీలో విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. ప్రతిరోజూ విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు. దీనిపై కూడా ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక మార్చి నుంచి ఏపీలో విద్యుత్తు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బొగ్గు నిల్వలకు డబ్బు చెల్లించకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని ఉండవల్లి చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా జగన్ పూర్తి చేయలేరని ఆయన అనడం చర్చనీయాంశమైంది. వైసీపీ నేతలు ఉండవల్లి వ్యాఖ్యలకు కనీసం సమాధానం ఇవ్వాల్సి ఉంది. లేకుంటే ఆయన చెప్పింది నిజమని అంగీకరించినట్లవుతుంది.


Tags:    

Similar News