ఉద్ధవ్ విల్లు ఎలా ఎక్కుపెడతారు?

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న గుర్తు తనకు కాకుండా పోయింది

Update: 2023-02-18 06:42 GMT

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న గుర్తు తనకు కాకుండా పోయింది. ఇది థాక్రేకు ఎదురుదెబ్బే. పార్టీ పేరుతో పాటు గుర్తును కూడా ఎన్నికల కమిషన్ షిండే వర్గానికి కేటాయించడం ఉద్ధవ్ థాక్రేకు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ధనస్సు గుర్తు కూడా షిండే వర్గానికి దక్కడంతో ఆయన మరో గుర్తుపై వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇది థాక్రే పార్టీ అభ్యర్థులకు ఇబ్బందిగా మారనుంది. పార్టీకి బలమైన అభిమానులు తప్పించి, సామాన్యులకు గుర్తు విషయం తెలియకపోవచ్చు.

స్థాపన నాటి నుంచి...
శివసేనను బాలా సాహెబ్ థాక్రే స్థాపించిన నాటి నుంచి హిందూ సంస్థగా తీర్చి దిద్దారు. 1995 నుంచి ఆయన శివసేనను ఒక సంస్థగా మాత్రమే తీర్చి దిద్దారు. మహారాష్ట్రలో శివసేన బలోపేతమయిందంటే అది బాలా సాహెబ్ థాక్రే శ్రమ కారణమే. దానిని ఎవరూ కాదనలేరు. హిందువులకు అండగా, మరాఠీలకు మద్దతుగా శివసేన నిలుస్తూ అందరి అభిమానాలను కూడగట్టుకుంది. బాలా సాహెబ్ థాక్రే బతికున్నంత వరకూ రాజకీయాల జోలికి పోలేదు. ఆయన రాజకీయాలను శాసించే వారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన కుటుంబం పోటీకి దూరంగా ఉండేది. అధికారం కోసం పెద్దపులి ఎప్పుడూ పాకులాడలేదు. ఆయన వద్దకే రాజకీయ అగ్రనేతలను రప్పించుకున్నారు.
గత ఎన్నికల తర్వాత...
కానీ థాక్రే మరణం తర్వాత ఆ కుటుంబ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తండ్రి వారసత్వంగా పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే అనంతరం బీజేపీతో కలసి నడిచారు. అప్పుడు కూడా ఆ కుటుంబం నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. కానీ గత ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే తనకు ముఖ్యమంత్రిని కావాలని కోరిక కలగడం, తన కుమారుడు ఆదిత్య థాక్రేను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించడం ద్వారా శివసేనను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగిన శివసేన కౌంటింగ్ అనంతరం మనసు మార్చుకుంది. తమకు బద్ధ విరుద్ధులైన, సిద్ధాంతాలకు దూరమైన సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాను ముఖ్యమంత్రిగా, కుమారుడు మంత్రిగా కొన్నాళ్లు అధికారం చెలాయించిన ఉద్ధవ్ ను ఏక్‌నాథ్ షిండే గట్టి దెబ్బ కొట్టారు. అత్యధిక శాతం ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి అయ్యారు.
బాణం గుర్తు పోవడంతో...
ఇప్పుడు చివరకు శివసేన పేరు దూరమయింది. ధనస్సు గుర్తు కూడా దూరమయింది. థాక్రే భావజాలానికి దూరమయిన ఉద్ధవ్ నుంచి గుర్తు, పార్టీ పేరు వెళ్లడం కూడా సరైనదేనని ఏక్‌నాథ్ షిండే అంటున్నారు. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే కొత్త గుర్తుతో ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం అంతసులువు కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అతి పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో కొత్త గుర్తుతో వెళ్లి ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి వెళితే ఉద్ధవ్ కు రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆయన ఎలా తన పార్టీని ముందుకు తీసుకెళతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ బాల్ థాక్రే అభిమానులు వేల సంఖ్యలో ఉన్నారు. వారి సాయంతో కొత్త పార్టీ పేరు, గుర్తుతో ముందుకు వెళతారా? మరోసారి గుర్తు తొలగింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News