సీమ టపాకాయ్ పేలుతుందా?

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న డిమాండ్ పెరుగుతుంది

Update: 2022-11-21 08:29 GMT

సీమలో రాజకీయ సందడి మొదలయింది. సవాళ్లు విసురుతున్నారు. తొడలు కొడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అప్పుడే సీట్ల పంచాయతీ మొదలయింది. పౌరుషాల గడ్డ మీద పవర్ చూపించేందుకు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. మూడు పదుల వయసులో మీసాలు మెలేస్తూ తొడగడుతున్న యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలో కీలకంగా మారారు. ఆయన నామినేటెడ్ పదవుల్లోనే ఉంటారా? వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతారా? అన్నది కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాస్ లీడర్. యువతలో స్పెషల్ క్రేజ్ ఉంది. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న డిమాండ్ పెరుగుతుంది. బైరెడ్డి కుటుంబానికి పట్టున్న నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ గా మారిపోవడంతో అక్కడ పోటీ చేసే ఛాన్స్ లేదు. మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? జగన్ కు బైరెడ్డి పోటీ చేయడానికి అవకాశమిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.


చిన్న వయసులోనే...

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. బైరెడ్డిని జగన్ ఆకట్టుకోవడం, జగన్ వెంట నడవాలని నిర్ణయించుకోవడంతో తన కుటుంబంలో ఉన్న రాజకీయ నిర్ణయాన్ని కాదని ఆయన జగన్ కు దన్నుగా నిలిచారు. తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ, బీజేపీ ఇలా చక్కర్లు కొడుతున్న సమయంలోనే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ వెంట నడిచారు. ఇందుకోసం తన కుటుంబంలో పెద్దగా వ్యవహరించే పెదనాన్నను సయితం థిక్కరించారు. నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని జగన్ చిన్న వయసులోనే నియమించారు. అయితే కొంతకాలం క్రితం ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం పెద్దయెత్తున జరిగింది.కానీ దానిని బైరెడ్డి కొట్టిపారేశారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు.
నందికొట్కూరులో...
జగన్ అనుకున్నట్లుగానే, ఆశించినట్లుగానే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించారు. ఆ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గమైనా అక్కడ బైరెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం. తన కుటుంబానికి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకును తన వైపునకు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తిప్పుకోగలిగారు. గౌరు కుటుంబానికి ఉన్న క్రేజ్ ను తనవైపునకు తిప్పుకోగలిగారు. అదే సమయంలో యువతను ఆకట్టుకోగలిగారు. అనంతరం నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. అయినా హైకమాండ్ మాత్రం బైరెడ్డికి అండగానే నిలిచింది. ఆయన స్థానికసంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటగలిగారు. దీంతో జగన్ బైరెడ్డికి స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు.
అసెంబ్లీకి వెళ్లాలన్న....
అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నేరుగా అసెంబ్లీకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే ఆయన పాణ్యం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరుసార్లు ఇప్పటికే గెలిచారు. కాటసాని తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపాలని భావిస్తున్నారు. నందికొట్కూరులో బైరెడ్డి కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్న గౌరు కుటుంబం అక్కడి నుంచి పోటీ చేసే అవకాశముంది. పాణ్యం టిక్కెట్ తనకు కావాలని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

పాణ‌్యం నుంచి...
కాటసాని రాంభూపాల్ రెడ్డి రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి టిక్కెట్ ఖాయమన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతుంది. పాణ్యంలో గౌరు కుటుంబాన్ని గట్టిగా ఎదుర్కొనే యువనేతగా కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పార్టీ హైకమాండ్ గుర్తించినట్లు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే వచ్చే ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డిని పెద్దల సభకు పంపుతామని హామీ ఇచ్చి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి పాణ్యం టిక్కెట్ ఇవ్వవచ్చన్న టాక్ నడుస్తుంది. కర్నూలు జిల్లాలోనే కాకుండా బైరెడ్డికి యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో జగన్ ఆ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పోటీకి దిగి నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఎంతో దూరం లేదని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News