గెలిచినా.. ఓడినా సమస్యేగా?

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది. అయితే సీఎంను ఎవరిగా ఎంపిక చేయాలన్నది సమస్యగా మారింది.

Update: 2022-12-10 08:14 GMT

కాంగ్రెస్ కు గెలిచినా సమస్యే. ఓడినా సమస్యే. ప్రజాస్వామ్యం ఎక్కువ కావడంతో పార్టీలో నేతలందరూ ఎవరికీ వారే తాము గొప్ప నేతలమని ఫీలయిపోతుంటారు. సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కాంగ్రెస్ లో ఇదే ధోరణి కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదంటే.. పార్టీలు మారడాలు... ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి మంత్రి పదవుల వరకూ తమకే ఇవ్వాలని పట్టుబడుతుంటారు. లేదంటే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతారు. తన వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న గుడ్డి నమ్మకంతో కాంగ్రెస్ నేతలుండటం రివాజుగా మారింది.

సంతోషపడాలనుకుంటే...
ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోనూ అంతే. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది. రెండు రాష్ట్రాల్లో ఒకటి గెలిచినందుకు సంతోషపడాలో... ఎందుకు గెలిచామని బాధపడాలో తెలియని పరిస్థితి పార్టీ హైకమాండ్‌ది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే కొట్లాట ప్రారంభమయింది. తమకే సీఎం పదవి కావాలంటూ పోటీ పడుతున్నారు. పట్టుబడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ సమావేశమై ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ కే వదిలేశారు.

సీఎం కుర్చీ కోసం...
సహజంగా ముఖ్యమంత్రి పదవి అంటే అన్నీ బేరీజు వేసుకుంటుంది హైకమాండ్. సామాజికవర్గంతో పాటు అందరిని సమన్వయం చేసుకుని వెళ్లగలిగిన నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తుంది. ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ముందున్నారు. ఆమెతో పాటు శాసనసభ పక్ష మాజీ నేత ముఖేష్ అగ్నిహోత్రి, వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది.
ప్రియాంక నిర్ణయంపై...
బీజేపీ అసలే కాచుక్కూర్చుని ఉంది. ఏ మాత్రం అసంతృప్తి కన్పించినా వారికి గాలం వేయడానికి రెడీగా ఉంది. ఈ సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఇందుకోసం పార్టీ సీనియర్ నేతలతో ప్రియాంక గాంధీ సంప్రదిస్తున్నారు. ఎవరినీ నొప్పించకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగని సమర్థుడైన నేతనే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ లో ఎవరిని ఎంపిక చేసినా అసంతృప్తి మామూలే. బీజేపీ 25 అసెంబ్లీ స్థానాలను గెలిచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉత్కంఠత నెలకొంది.


Tags:    

Similar News