ఎన్నాళ్లకెన్నాళ్లకు... రెండున్నర దశాబ్దాలకు...?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నామినేషన్లు ముగిశాయి. రెండున్నర దశాబ్దాల తర్వాత దక్షిణాదికి ఏఐసీసీ అధ్యక్ష పదవి లభించబోతుంది

Update: 2022-10-01 03:50 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నామినేషన్లు ముగిశాయి. ఈ పోటీలో ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ ఉంది. రెండున్నర దశాబ్దాల తర్వాత దక్షిణాదికి ఏఐసీసీ అధ్యక్ష పదవి లభించబోతుంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ఇద్దరూ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారే. మల్లికార్జున ఖర్గే కర్ణాటకు చెందిన వారు కాగా, శశిథరూర్ కేరళకు చెందిన వారు. ఎవరు గెలిచినా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారికి కాంగ్రెస్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. 1992 నుంచి1994 వరకూ తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరిలో ఎవరు ఎన్నికయినా దక్షిణాది రాష్ట్రానికే ఈ పదవి దక్కనుంది.

గాంధీ కుటుంబం...
అయితే గాంధీ కుటుంబం ఆశీస్సులున్న మల్లికార్జున ఖర్గే ఎన్నిక నల్లేరు మీద నడకే అవుతుంది. ఖర్గేకు సోనియా నుంచి రాహుల్ వరకూ మద్దతు ఉంది. ఆయన నామినేషన్ పై సంతకాలు చేసిన వారిని చూస్తేనే అర్థమవుతుంది. ఆంటోని, అశోక్ గెహ్లాత్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ వంటి వారు ఖర్గే నామినేషన్ ను ప్రతిపాదించిన వారిలో ఉన్నారంటే అర్ధమయిపోయింది. మల్లికార్జున ఖర్గే విజయం దాదాపు ఖాయమయినట్లే. పోటీ నామమాత్రమే. పదివేల మంది సభ్యుల్లో అత్యధిక మంది ఖర్గేకే మద్దతివ్వడం ఖాయం.
సీనియర్ నేతగా...
మల్లికార్జున ఖర్గే వయసు 80 ఏళ్లు. డీసీసీ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. 2008లో ఆయన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ హయాంలో ఉన్నారు. దళితనేతగా ఆయన అందరికీ సుపరిచితులు. 1969లోనే కాంగ్రెస్ లో చేరారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. గాంధీ కుటుంబానికి వీర విధేయత అదనపు ప్లస్ పాయింట్. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఆయన వ్యవహరించారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎనిమిదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు.
బెస్ట్ ఆప్షన్....
శశిథరూర్ 2005లో కాంగ్రెస్ లో చేరారు. విదేశాల్లో చదువుకుని వచ్చారు. దూకుడు స్వభావం ఉన్న నేత. అయితే శశిధరూర్ పట్ల గాంధీ కుటుంబానికి అంత సానుకూలత లేకపోవడం మైనస్ పాయింట్. అధ్యక్షుడిగా శశిధరూర్ ఎన్నికయితే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయని వారికి తెలియంది కాదు. అందుకే బెస్ట్ ఆప్షన్ కింద నమ్మకమైన నేత మల్లికార్జున ఖర్గేను గాంధీ కుటుంబం మద్దతు ఇస్తుంది. ఆయన గెలుపు ఖాయమయినట్లే. చాలా రోజుల తర్వాత దక్షిణాదికి చెందిన ఒక దళిత నేతకు జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి లభించబోతుందన్నది వాస్తవం. అధికారంలో లేనప్పడు ఎవరు కష్టపడితే వారికి పదవులు ఇచ్చారన్న గౌరవమూ గాంధీ కుటుంబంపై పెరుగుతుంది.


Tags:    

Similar News