బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరిమికొట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని ప్రియాంక గాంధీ కోరారు.

Update: 2023-05-08 13:07 GMT

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరిమికొట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని ప్రియాంక గాంధీ కోరారు. జైబోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మిత్రులారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగిన నిరుద్యోగ సంఘర్షణ సభలో ప్రియాంక ప్రసంగించారు. కర్ణాటక ప్రచారంలో పాల్గొని తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొన్నారు. చనిపోయిన 140 కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులను అంద చేశారు. తెలంగాణ కోసం వందల మంది ప్రాణాలు త్యాగాలు చేశారని ప్రియాంక గుర్తు చేశారు. తెలంగాణను తల్లిగా భావించే ప్రజలందరికీ తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రియాంక అన్నారు. రైతులకు మద్దతు ధర, భూమికి సాగునీరు కావాలని అందరూ కోరుకున్నారన్నారు.

ఏ పరిస్థితుల్లో రాష్ట్రం...?
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో సభకు తరలి వచ్చారు. తెలంగాణ కోసం అమరవీరులయిన వారిలో శ్రీకాంతాచారి ఒకరని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. యువత భవిష్యత్ కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు. వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఏ దిశగా పయనిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఊరికే ఇవ్వలేదన్నారు. బలిదానాలు వృధా కాకూడదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రియాంక కోరారు. తన కుటుంబం కూడా ప్రాణ త్యాగాలు చేసిందన్న ప్రియాంక వారి ప్రాణ త్యాగాలు వృధా కాకూడదని ఆకాంక్షించారు.
బలిదానాలు చేసి...
దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేశారన్న ప్రియాంక నీళ్లు,నిధులు, నియామకాల కోసం సాధించుకున్న రాష్ట్రం వాటిని సాధించుకోకపోవడం విచారకరమని అన్నారు. నేటి తెలంగాణ మీరు కోరుకున్న తెలంగాణ కాదన్నారు. కొందరి చేతుల్లోనే తెలంగాణ చిక్కుకుపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రత్యేక రాష‌్ట్రం ఇవ్వలేదని, ఇక్కడి ప్రజల బాధలను చూసి ఇచ్చారని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ పనిచేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. ఎనిమిదివేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో...
కొద్ది నెలల్లోనే ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయని, కాంగ్రెస్‌కు అండగా నిలవాలని ప్రియాంక కోరారు. నిరుద్యోగులు, యువత అండగా నిలబడాలన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయినా ఎలాంటి చర్యలు లేవన్న ప్రియాంక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చి తొమ్మిదేళ్లయినా ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రతి ఒక్కరిపై అప్పుల భారం పెరగడమే తప్ప అభివృద్ధి లేదన్న ప్రియాంక గాంధీ అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కొత్తగా ఒక్క యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారా? అని ప్రియాంక ప్రశ్నించారు. ప్రజల డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో ఆలోచించాలని కోరారు. నలభై ఏళ్లయినా ఇప్పటికీ ఇందిరాగాంధీని తలచుకున్నారంటే ఆమె చేసిన పనులు అలాంటివని ప్రియాంక అన్నారు. బైబై మోదీ, బైబై కేసీఆర్ అన్న నినాదాలను నిజం చేయాలని ప్రియాంక కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పంపిిణీ చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News