కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ ఫార్ములా
కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకలో ఈసారి ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. 136 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే దీనిపై కాంగ్రెస్ మార్క్ ఫార్ములా అమలు చేయనున్నట్లు తెలిసింది. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సూర్జేవాలాలు సీఎల్పీ మీటింగ్‌కు హాజరు కానున్నారు. అయితే డీకే శివకుమార్, సిద్ధరామయ్యలలో ఒకరికి ముఖ్యమంత్రి పదవి దక్కనుంది. అందుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది.
సాయంత్రం సీఎల్పీ...
పెద్దగా వెయిట్ చేయకుండానే రేపే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే డీకే శివకుమార్ పార్టీకి ఎంతో ఉపయోగపడ్డారు. ట్రబుల్ షూటర్‌గా పేరుంది. నమ్మకమైన నేతగా ఆయనకు అధిష్టానం వద్ద కూడా పలుకుబడి ఉంది. పీీసీసీ అధ్యక్షుడిగా కొన్నేళ్ల నుంచి పార్టీని కర్ణాటకలో బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. సిద్ధరామయ్యకూడా బీసీ నేతగా అందరి వాడుగా మన్ననలను పొందిన వాడే.
ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు...
అందుకే ఈసారి ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఒక్కలిగ, లింగాయత్, దళిత సామాజికవర్గం నేతలను డిప్యూటీ సీఎం పదవికి ఎంపిక చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా డీకే శివకుమార్‌కు నచ్చ జెప్పి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి దీనిపై స్పష్టత రానుంది. సాయంత్రం సీఎల్పీ సమావేశం పూర్తి కాగానే కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు.