టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా...? చిక్కుల్లో బీజేపీ

కేంద్ర ప్రభుత్వంపై దూకుడుతో ఉన్న కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-12-08 04:57 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు వేరుగా ఉంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై దూకుడుతో ఉన్న కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తమ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించాలని ఆయన డిసైడ్ అయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసే అవకాశాలున్నాయి. పార్లమెంటు సభ్యులు మాత్రం రాజీనామా చేయరు.

కేసీఆర్ తో భేటీలో....
టీఆర్ఎస్ తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ పార్లమెంటు సమావేశాల్లో వారం రోజుల నుంచి ఆందోళన చేస్తుంది. అయినా ఫలితం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. వారు కేసీఆర్ తో నేడో, రేపో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాజీనామాల నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఐదుగురు రాజీనామా?
టీఆర్ఎస్ కు రాజ్యసభలో ఏడుగురు ఎంపీలున్నారు. అందులో బండ ప్రకాష్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఐదుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. రాజీనామాలు ఆమోదించి తిరిగి ఎన్నికలు జరిగినా వీరు మళ్లీ గెలిచే అవకాశాలుండటంతో కేసీఆర్ రాజీనామా అస్త్రాన్ని బీజేపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
షా అత్యవసర సమావేశం....
మరోవైపు బీజేపీ కూడా అప్రమత్తమమయింది. రేపు సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు కబురు పంపారు. ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాజీనామాల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించి బీజేపీకి ఝలక్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. మరి బీజేపీ దీనికి ఏవిధమైన విరుగుడు కనిపెడుతుందో చూడాలి.


Tags:    

Similar News