అంతా సిద్ధం... మరొక యుద్ధం ఏ క్షణంలోనైనా?

తైవాన్ పై చైనా యుద్ధానికి సిద్ధమయింది. చుట్టుపక్కల సైనిక విన్యాసాలను చేసింది. బలగాలను మొహరించింది.

Update: 2023-04-11 04:46 GMT

ఒకవైపు రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య ఏడాది పైగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరో యుద్ధం మొదలయ్యేలా ఉంది. తైవాన్ పై డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సిద్ధమయింది. ఇప్పటికే తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలను చేసింది. బలగాలను మొహరించింది. ఎప్పుడైనా యుద్ధం మొదలు కావచ్చని చైనా ప్రకటించింది. అందుకు సిద్ధంగా ఉండాలని తైవాన్ ను హెచ్చరించింది. మూడు రోజుల పాటు తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా యుద్ధ విన్యాసాలు చేస్తుండటంతో యుద్ధం త్వరలోనే మొదలవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.

ఆర్మీ విన్యాసాలు...
తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికాలో పర్యటించడంపై డ్రాగన్ ఆగ్రహం వ్యక్తంచేస్తుంది. దీంతో యుద్ధ విన్యాసాలకు దిగింది. అమెరికా మద్దతును కోరేందుకే త్సాయి ఇంగ్ వెన్ అక్కడ పర్యటించినట్లు చైనా అనుమానిస్తుంది. అందుకే వేగంగా అడుగులు వేసి పెద్దయెత్తున సరిహద్దుల్లో ఆర్మీని దించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
అమెరికా జోక్యంపై....
మరోవైపు తైవాన్ స్వాతంత్ర్యంతో పాటు విదేశీ జోక్యం పై చైనా మండిపడుతోంది. అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని చైనా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ సముద్ర, ఆకాశ మార్గాలను నియంత్రించేందుకు చైనా ఈ ఆర్మీ విన్యాసాలు చేసినట్లు కనపడుతుంది. దీంతో చైనా తైవాన్ పై ఏక్షణమైనా యుద్ధానికి దిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. తొలి సారి జె 15 విమానాలు కూడా విన్యాసాల్లో పాల్గొన్నాయి. తైవాన్ ను అన్ని వైపుల నుంచి దిగ్భంధించే ప్రయత్నాలు చేసింది. వార్ ఎప్పుడు మొదలవుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న.


Tags:    

Similar News