అన్నీ ఆలోచించే ఎన్టీఆర్ పేరు మార్చాం

ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబు కంటే తాను ఎక్కువగా ఎన్టీఆర్ గౌరవిస్తామని చెప్పారు.

Update: 2022-09-21 07:18 GMT

ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబు కంటే తాను ఎక్కువగా ఎన్టీఆర్ గౌరవిస్తామని చెప్పారు. తాను ఇంతవరకూ ఎన్టీఆర్ ను అగౌరవపర్చలేదన్నారు. వైసీపీ నందమూరి తారక రామారావు పేరు పలికితే చంద్రబాబుకు నచ్చదని, చంద్రబాబు ఆ పేరు పలికితే పైనున్న ఎన్టీఆర్ కు నచ్చదని జగన్ అన్నారు. ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నేతగా అందరి మన్ననలను అందుకున్నారన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉండి ఉంటే ఎన్టీఆర్ చాలా రోజులు బతికి ఉండేవారని జగన్ అన్నారు. రెండో సారి ముఖ్యమంత్రిగా పూర్తి కాలం ఉండేవారన్నారు.

ఏనాడు కించపర్చలేదు..
వైసీపీతో ఎన్టీఆర్ కు వైరుధ్యం లేకపోయినా, వైఎస్ కు ఆయన ప్రత్యర్థిగా ఉన్నా తాను ఎప్పుడూ ఎన్టీఆర్ ను కించపర్చలేదన్నారు. ఆయన పేరిట జిల్లాకు పెట్టడం జరిగిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు మారుస్తారని చెప్పారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారు నేడు ఆయన కోసం నినాదాలు చేయడం దారుణమన్నారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకుని తిరిగే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని జగన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చంద్రబాబుకు ఎన్నికలప్పుడే గుర్తుకొస్తుందన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబుకు తన కుమార్తెను గిఫ్ట్ గా ఇస్తే చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ గా వెన్నుపోటు పొడిచారన్నారు.
ఆరోగ్య పథకాల సృష్టికర్త...
రాజకీయాల్లో సిన్సియారిటీ కరువయిందన్నారు. హెల్త్ వర్సిటీ పేరు మార్చడానికి చాలా ఆలోచించామని తెలిపారు. వైఎస్సార్ స్వతహాగా డాక్టర్ అని, వివిధ ఆరోగ్య పథకాల సృష్టికర్త వైఎస్సార్ అని అన్నారు. పేదరికంలో ఉండే కష్టాలు తెలిసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ప్రాణాల విలువ ఆయనకు తెలుసునని అన్నారు. ఆరోగ్య రంగంలో సంస్కరణలు తెచ్చారన్నారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులో తెచ్చిన మానవతావాది అని అన్నారు. ప్రభుత్వరంగంలో 11 మెడికల్ కళాశాలలు ఉంటే వైఎస్ మూడు కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు 17 మెడికల్ కళాశాలలను పెడుతున్నామని జగన్ తెలిపారు. 28 ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలో ఏర్పాటయితే ఆ పేరు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో...
టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కళాశాల ఎందుకు పెట్టలేదని జగన్ నిలదీశారు. ఎన్టీఆర్ ను గౌరవించే విషయంలో మనసులో కల్మషం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన వాటికి ఆయన పేరు పెట్టమని కడితే ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తామని తెలిపారు. క్రెడిట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రావాలన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. అందుకే పేరు మార్చాల్సి వచ్చిందని జగన్ అసెంబ్లీలో తెలిపారు. ఎవరినీ అగౌరవించే కార్యక్రమం కాదని జగన్ శాసనసభలో అన్నారు.


Tags:    

Similar News