బాబు మారారు.. కొత్త పథకాలకు డిజైన్

జగన్ ప్రస్తుతం ఏపీ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే మరింత మెరుగైన పథకాల రూపకల్పనకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు

Update: 2022-08-28 06:21 GMT

తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను నమ్ముతున్నట్లే కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు అభివృద్ధి పైనే ఎక్కువగా ఆసక్తి కనపర్చే వారు. కానీ వైసీపీ ప్రభుత్వ పాలన తర్వాత చంద్రబాబు సంక్షేమ పథకాలను విస్మరిస్తే పార్టీకి భవిష్యత్ ఉండదని గ్రహించినట్లుంది. అందుకే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే మరింత మెరుగైన పథకాల రూపకల్పనకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. సంక్షేమ పథకాల డిజైన్ కోసం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఒక టీం ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయానికి తగినట్లుగానే కొత్త సంక్షేమ పథకాల రూపకల్పనను డిజైన్ చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబుకు సమర్థమంతమైన నేతగా పేరుంది. సంక్షేమం విషయంలో ఆయన వెనకబడి ఉన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ లతో పోలిస్తే చంద్రబాబు వెల్ఫేర్ విషయంలో మాత్రం అంత పేరు సంపాదించుకోలేకపోయారు.

కుప్పం పర్యటనలో...
అందుకే కుప్పం నియోజకవర్గం పర్యటనలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే కొత్త సంక్షేమ పథకాలతో మీ ముందుకు వస్తానని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలను టీడీపీ అమలు చేస్తుందని ఆయన కుప్పం సభలో ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడానికి చంద్రబాబు హామీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అన్ని సామాజికవర్గాలకు లబ్ది చేకూర్చేలా సంక్షేమ పథకాలను రూపొందించాలని ఆ టీంను చంద్రబాబు ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నగదు రూపంలోనే....
జగన్ ప్రజలకు డబ్బులు అలవాటు చేశారు. ఆదరణ పథకం కింద వస్తువులు ఇస్తే ఎవరూ తీసుకోరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నగదుతోనే అమలు చేయాల్సి ఉంటుంది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలంటే ప్రజలు పెద్దగా పట్టించుకోరన్నది స్పష్టమయిపోయింది. నగదు ఇస్తేనే జగన్ కు మించి జనానికి దగ్గరవుతామని సీనియర్ నేతలు కూడా చంద్రబాబుకు చెబుతున్నారు. అంతే తప్ప పథకాల రూపంలో వారికి ఎలా ఆదుకున్నా వాటిని పట్టించుకోరని, విస్మరిస్తారని చెప్పడంతో చంద్రబాబు కూడా నగదు సహిత పథకాల వైపు మొగ్గు చూపారని తెలిసింది. అది ఎంత అని కంటే.. జగన్ కంటే మెరుగ్గా అని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పింఛను మొత్తాన్ని ఐదు వేల రూపాయలకు పెంచే అవకాశాలున్నాయంటున్నారు.
విజన్.. వెల్ఫేర్ తో...
మరో విషయం జగన్ లా ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెల నగదు రూపంలో కొంత మొత్తం జనాలకు చేరేందుకు విన్నూత్నంగా పథకాలను డిజైన్ చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే అది ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక భారం కాకుండా ఉండేలా చూడాలని సదరు స్కీమ్ లు డిజైన్ చేసే టీంకు ఆయన సంకేతాలు పంపినట్లు తెలిసింది. తనపై ఎలాగూ విజన్ ఉన్న నేతగా ముద్ర ఉంది కాబట్టి వెల్ఫేర్ స్కీమ్ లను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల మ్యానిఫేస్టోలో ఈ కొత్త సంక్షేమ పథకాలను పొందు పర్చి, వాటిని అమలు చేస్తానని కూడా ప్రజలకు వచ్చే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేయనున్నారు. విన్నూత్న సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు రానున్న చంద్రబాబును జనం ఏ మేరకు విశ్వసిస్తారన్నది చూడాల్సి ఉంది. అందుకే కుప్పం పర్యటనలో ఆయన ఒక ఫిల్లర్ వదిలారు.


Tags:    

Similar News