వంశీని బాబు ఏం చేయలేరా?

వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు తప్పు చేస్తున్నారన్న కామెంట్స్ పార్టీ నుంచి వినపడుతున్నాయి.

Update: 2021-11-24 13:15 GMT

చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నానుస్తారు. అందుకే అనేక సార్లు ఆయన నష్టపోయారు. రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ నిర్ణయాల్లో జాప్యం కారణంగా ఇబ్బందిపడ్డారు. వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు తప్పు చేస్తున్నారన్న కామెంట్స్ పార్టీ నుంచి వినపడుతున్నాయి. ఆయనను తొలుతే పార్టీ నుంచి బహిష్కరించి ఉంటే బాగుండేదంటున్నారు. వంశీని పార్టీ నుంచి బహిష్కరించకుండా చంద్రబాబు ఏం సాధించారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

పార్టీలోనే సాంకేతికంగా....
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలోనే రాజకీయంగా ఎదిగారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆయన మొన్న ఎన్నికల్లో పార్టీ అధికారంలో రాకపోవడంతో వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. పార్టీ మారినప్పుడే చంద్రబాబును ఘాటుగా విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. కానీ చంద్రబాబు మాత్రం షోకాజ్ నోటీసు ఇచ్చి వదిలేశారు. పార్టీ నుంచి బహిష్కరిస్తే వల్లభనేని వంశీ నేరుగా వైసీపీలో చేరిపోతారని చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోక పోయి ఉండవచ్చు.
ఇబ్బంది పడుతున్నా....
కానీ వల్లభనేని వంశీ కారణంగా పార్టీ, వ్యక్తిగతంగా చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారన్నది చూడాల్సి ఉంది. వల్లభనేని వంశీ ఇప్పటికీ సాంకేతికంగా టీడీపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. వంశీ పార్టీకి చేసిన రాజీనామాను కూడా చంద్రబాబు ఆమోదించలేదు. దీంతో ఆయన అన్ని రకాలుగా టీడీపీ నేతగానే ఉన్నారు. అదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. వైసీపీ కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించింది తాము కాదని వారి పార్టీ నేతలేనని చెబుతున్నారు.
కొత్తగా కలిగే నష్టమేంటి?
వల్లభనేని వంశీ వల్ల కొత్తగా జరిగే నష్టం లేదు. భవిష్యత్ లో ప్రయోజనం లేదు. పైగా అది అలుసుగా చేసుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులను వంశీ తూలనాడారంటున్నారు. అందుకే వంశీని బహిష్కరించాలంటూ పార్టీ నుంచే వాదనలు విన్పిస్తున్నాయి. అప్పుడే పార్టీకి గౌరవం ఉంటుందని, గన్నవరం నియోజకవర్గంలోనూ పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మరి వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News