చెడ్డీ గ్యాంగ్ స్టైలే సపరేటు...

Update: 2018-08-01 12:11 GMT

తెలుగు రాష్ట్రాలను ముప్పతిప్పలు పెట్టిన చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. ఈ ముఠా కోసం నెల రోజులపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ తిరిగిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు చివరకు గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పోలీసులకు చుక్కలు చూపించింది. స్థానికుల సహాకారంతో ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సిటీలో తిష్ట వేసిన మరో మూడు టీమ్స్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఊర్లో మాత్రం అమయకులుగా...

చెడ్డీ గ్యాంగ్ ఈ పేరు వినపడితే చాలు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న జనం నిద్రపోవడం మర్చిపోతారు. ఎప్పుడు, ఎలా, ఏ టైంలో దాడి చేస్తారో తెలియక భయంతో వణికిపోతారు. సిటీలోని మూడు కమిషనరేట్ల పోలీసులతో పాటు, ఆంధ్ర పోలీసులు సైతం వీరి కోసం తెగ గాలిస్తున్నాయి. అలాంటి కరుడుగట్టిన ఈ గ్యాంగ్ ని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

చూడటానికి అమాయకంగా కనిపించే ఈ ముఠా దొంగతనం స్కూల్ లో వీరు నేర్చుకున్న మొదటి పాఠం అదే.. అమాయకంగా కనిపించాలి.. ఎంత కొట్టినా నోరు మాత్రం విప్పకుండా మూగవాడిలా నమ్మించాలి.. అయితే సిటీలో చోరీలు చేసే వీళ్లు తమ ఊరిలో మాత్రం మంచి వ్యక్తులుగా చెలామణి అవుతారు.. పట్టుకోవడానికి పోలీసులు వెళితే విల్లు ఎక్కుపెట్టి పోలీసులను పరుగులు తీయిస్తారు.

పక్కా ప్లాన్ తో చోరీలు...

వీరిని పట్టుకునేందుకు పోలీసులు నెల రోజులు పాటు గుజరాత్ లో మకాం వేసి దహోడ్ ప్రాంతానికి చెందిన పారమౌర్ కిషన్, రావోజీ బధియా, భారత్ సింగ్ అనే ముగ్గురిని పట్టుకున్నారు. వీరి ముఠా నాయకుడు రాంజీ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ ముగ్గురు పట్టుబడితే సిటీలో ఇంకా నాలుగు ముఠాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీపావళి పండుగ రోజున ట్రైన్ లో రెండు నెలల ముందు సిటీకి వచ్చే చెడ్డీ గ్యాంగ్ ఒక్కొక్క ముఠా ఒక్కో స్టేషన్ లో దిగిపోతారు. సిటీలో ఓ స్పాట్ ఎంచుకొని రెక్కీ చేస్తారు. రాత్రి వరకు పక్కనే ఉండే అటవీ ప్రాంతంలో తలదాచుకొని చీకట్లో చోరీ చేస్తారు. అయితే వీరి ఆయుధం ఒక ఇనుపరాడ్డు మాత్రమే. దానితోనే తలుపులు గడియ తీసి దోపిడీలు చేస్తారు. ఎవరైనా అడ్డువస్తే రాళ్లతో బెంబేలెత్తించి పారిపోతారు. ముఠాలో ఎవరు మిస్ అయినా ఫలనా స్టేషన్ లో కలుసుకోవాలని టైం డిసైడ్ చేసుకుంటారు. టార్గెట్ కూడా ఒక్క రాత్రిలోనే పూర్తి చేస్తారు. పట్టుబడిన ఈ ముఠాపై మొత్తం 28 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 15 కేసులున్నాయి. ఈ నిందితుల నుండి 100 గ్రాముల బంగారం, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News