ఇక ఆ సిమ్‌ కార్డులు తీసుకోవడం నిలిపివేత.. కేంద్రం సంచలన నిర్ణయం

టెలికం రంగంలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తూ ..

Update: 2023-08-18 04:31 GMT

టెలికం రంగంలో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బల్క్ సిమ్‌కార్డు కనెక్షలు తీసుకునేందుకు వీలుండదు. బల్క్‌ సిమ్‌ కనెక్షలను అందించడం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. అలాగే సిమ్‌కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ తప్పని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు వెరిఫికేషన్‌ అయిన తర్వాతే సిమ్‌ కార్డులు విక్రయించేందుకు డీలర్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలు, మోసాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

బల్క్ సిమ్‌లకు బదులుగా బిజినెస్ సిమ్‌లు:

అయితే వివిధ కంపెనీలు ఉద్యోగుల కోసం బల్క్‌ సిమ్‌ కార్డులను తీసుకుంటుంది. అలాంటి సమయంలో బల్క్‌ సిమ్‌ కనెక్షన్లను నిలిపివేస్తే ఎలా అనేది ప్రశ్న. అయితే ఆ సమస్యకు కూడా పరిష్కారం అందించారు కేంద్ర మంత్రి. బల్క్‌ సిమ్‌ కార్డులకు బదులుగా బిజినెస్‌ సిమ్‌లను పొందాలని సూచించారు. అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ వ్యాపారం లేదా కార్పొరేట్ సంస్థ నుంచి కేవైసీ పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సంస్థలు రిజిస్టర్ అయినందున వారి జీఎస్టీ రిజిస్ట్రేషన్, పాన్, ఐటీ రిజిస్ట్రేషన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే బల్క్‌ సిమ్‌ కనెక్షన్లు తీసుకున్న వారు తర్వాత ఆ సిమ్‌కార్డులను వినియోగించడం మానేశారు. దీని వల్ల సిమ్‌లు దుర్వినియోగం కూడా అయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

అలాగే సిమ్‌లు విక్రయించే డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ మాత్రమే కాకుండా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా చేయాలని, సిమ్‌ కార్డుల దుర్వినియోగానికి డీలర్లను బాధ్యులను చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సిమ్ డీలర్ల ద్వారా సంఘ వ్యతిరేక శక్తులు సిమ్‌లు పొందుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

52 లక్షల సిమ్ కనెక్షన్ల రద్దు:

ఈ నేపథ్యంలో 52 లక్షల సిమ్‌కార్డులను రద్దు చేసినట్లు మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ఈ సంవత్సరం మే నెలలో ప్రభుత్వం సంచార్ సాథి అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 52 లక్షల సిమ్ కనెక్షన్లు నకిలీ పత్రాలను ఉపయోగించి వీటిని తీసుకున్నారని గుర్తించిన కేంద్ర టెలికం శాఖ వీటిని రద్దు చేసింది. అలాగే 67,000 మంది సిమ్ డీలర్లను సైతం బ్లాక్ లిస్ట్ చేసింది. అంతేకాకుండా 17,000 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు బ్లాక్ చేసింది. 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతే కాదు స్పామింగ్‌లో నిమగ్నమైన 66,000 వాట్సాప్ ఖాతాలు బ్లాక్ చేసినట్లు తెలుపగా, 8 లక్షల వ్యాలెట్ ఖాతాలను కూడా బ్లాక్ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Tags:    

Similar News